హైదరాబాద్: నిత్యం వార్తల్లో ఉండే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు గుడికడతానంటూ హల్ చల్ చేశారు. గుడికట్టాలంటే ఓ కండీషన కూడా పెట్టేశారు. 

అదేంటంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర కల్పిస్తే ఏడాదిలోగా కేసీఆర్ కు గుడికడతానంటూ ప్రకటించారు. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. రైతుకు మేలు చేసేలా సీఎం కేసీఆర్ మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. 

రైతు పండించిన పంటకు మద్దతు ధర ఇస్తామని ప్రకటించడం మంచిదన్నారు. అయితే ఇది సాధ్యమా, అసాధ్యమా అనేది కాలమే నిర్ణయిస్తోందన్నారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తే కచ్చితంగా గుడికడతానని ప్రకటించారు. 

అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు సైతం గుడికడతానంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయన్నారు. 

ఏడు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందండం తథ్యమంటూ ధీమా వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. మెుత్తానికి జగ్గారెడ్డి గుడి వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. జగ్గారెడ్డి మాటలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని అటు సొంత పార్టీని, ఇటు అధికార పార్టీని ప్రశంసిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.