తెలంగాణలో పచ్చదనం 7.7 శాతం పెరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయని చెప్పారు.
తెలంగాణలో పచ్చదనం 7.7 శాతం పెరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయని చెప్పారు. ఉద్యమంలా ప్రారంభమైన హరితహారంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. హరితహారంతో ఎన్నో అద్భుతాలు జరిగాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని తుమ్మలూర్ మండలంలో నిర్వహించిన హరితోత్సంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. గ్రామాలను పచ్చగా చేసిన ఘనత సర్పంచ్‌లదేనని అన్నారు.
పాలమూరు ఎత్తిపోతలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటే పూర్తయ్యేదని అన్నారు. అయితే కాంగ్రెస్ నేతు సుప్రీం కోర్టు దాకా వెళ్లి అడ్డుకుందని విమర్శించారు. ఈ వాస్తవాలను ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రజలకు సాగు, తాగు నీరు ఇస్తామంటే అడ్డుకోవడం దారుణమని చెప్పారు. హరితహరం అంటే కాంగ్రెస్ నేతలు జోకులు వేశారని అన్నారు.
మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, తాండూరు, పరిగి, వికారాబాద్ చేవెళ్ల నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత తనది అని అన్నారు. 100 శాతం ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. కృష్ణా నదిలో నీళ్ల కోసం పంచాయతీ ఉందని.. గోదావరిలో నీళ్ల పంచాయతీ లేదన్నారు. గండిపేట, హిమాయత్ సాగర్ వరకు గోదావరి లింక్ అవబోతుందని చెప్పారు. అక్కడ్నుంచి చిన్న లిఫ్ట్ పెట్టినా కూడా ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఏదో ఒక పద్ధతిలో ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చి ఇస్తామని చెప్పారు. వానలు వాపసు రావాలే.. కోతులు వావసు పోవాలే అనే పాట తానే రాశానని చెప్పారు.
‘‘తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతున్నప్పుడు.. మనకు వ్యవసాయం చేయరాదని, మనం అన్నం తినుడు కూడా నేర్పామని అన్నారు. వరి ఉత్పత్తిలో మనలను ఎక్కిరించినోళ్లు 7వ స్థానానికి పోయినారు. అనేక విషయాల్లో తెలంగాణ నెంబర్ వన్‌కు వచ్చింది. వాళ్లు మనకు సమీపంలో కూడా లేరు’’ ఏపీని ఉద్దేశించి కేసీఆర్ సెటైర్లు వేశారు.
మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్‌ను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తుమ్మలూరుకు సబ్ స్టేషన్‌ను కూడా మంజూరు చేస్తున్నామని తెలిపారు. మెట్రోను ఇక్కడివరకు పొడిగించాలని సబితా ఇంద్రారెడ్డి కోరినట్టుగా తెలిపారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు మెట్రోకు టెండర్‌లు పిలిచారని గుర్తుచేశారు. అటు బీహెచ్‌ఈఎల్, ఇటు మహేశ్వరం కందుకూరు వరకు మెట్రో తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు. వంద శాతం తీసుకొస్తామని తెలిపారు. మరోసారి బీఆర్ఎస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్.. నెక్ట్స్ టర్మ్‌లో ఇవన్నీ సాకారం చేసుకుందామని అన్నారు.
