Asianet News TeluguAsianet News Telugu

రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా.. కేసీఆర్ కీలక ప్రకటన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు.

KCR Says Telangana boycott niti aayog Meeting
Author
First Published Aug 6, 2022, 4:12 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు. శనివారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో కేంద్రం వైఖరిపై నిరసన తెలియజేయడానికి దీనిని ఉత్తమైన మార్గంగా భావిస్తున్నట్టుగా కేసీఆర్ చెప్పారు. బహిరంగ లేఖ ద్వారా ప్రధాని మోదీకి తనన నిరసనను నేరుగా తెలియజేయనున్నట్టుగా తెలిపారు.  

‘‘స్వాతంత్ర్య అనంతరం భారతదేశం ఎలా ఉండాలనేది విస్తృతమైన చర్చలు జరిగాయి. నాటి మేధావులు ఒక విజన్ కోసం పంచవర్ష ప్రణాళికలు అమలు చేశారు. భారత ప్రణాళిక సంఘం అంటే ఎంతో పేరు, ప్రఖ్యాతులు ఉండేవి. దేశానికి అవసరమైన కీలక నిర్ణయాలను ప్రణాళిక సంఘం తీసుకునేది. ప్రతి పంచవర్ష ప్రణాళికలో ఒక్కో లక్ష్యం  నిర్దేశించుకునేవారు . మేధావులు చెబితే స్వీకరించే సంస్కారం అప్పటి ప్రధానులకు ఉండేంది. రూ. 5 లక్షలకు మించిన నిధులు మంజూరు కావాలంటే పీపీఏ అనుమతి అవసరం ఉండేది. స్వాతంత్ర్యం నాటి నుంచి క్రమబద్దమైన ఆచరణ ఉండేది’’ అని కేసీఆర్ చెప్పారు. 

బీజేపీ ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చిందన్నారు. నీతి ఆయోగ్‌తో దేశానికి మంచి రోజులు వస్తాయని ఆశించామని చెప్పారు. కానీ ఇప్పుడు నీతి ఆయోగ్ నిరర్దక సంస్థగా మారిందని విమర్శించారు. బీజేపీ 8 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ది జరిగిందని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రైతులు 13 నెలల పాటు పోరాటం చేశారని గుర్తుచేశారు. రైతులు పోరాటం చేయకముందే.. 13 రోజుల్లో చట్టాలను రద్దు చేసి ఉండొచ్చు కదా అని  కామెంట్ చేశారు. దేశంలో ద్వేషం, అసహనం పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. రైతులకు ప్రధాని క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 

ప్రధాని చేసిన ఏ వాగ్దానం నెరవేరడం లేదన్నారు. నీతి ఆయోగ్‌లో మేథోమథనానికి బదులు.. ప్రధాని భజన బృందంగా మారిందని విమర్శించారు. రైతుల ఆదాయం పెరగలేదని.. ఆదాయం మాత్రం రెట్టింపు అయిందన్నారు. దేశంలో సాగురకు నీరు దొరకడం లేదని.. విద్యుత్ లేదన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిందని విమర్శించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పాతాళానికి పడిపోయిందన్నారు. నీతి ఆయోగ్ సిఫారసులను కూడా కేంద్రం గౌరవం ఇవ్వట్లేదని విమర్శించారు. నీతి ఆయోగ్‌కు ప్రధాని వద్ద గౌరవం సున్నా అని విమర్శించారు. నీతి ఆయోగ్ వల్ల దేశానికి ఏం ఉపయోగం జరిగిందని ప్రయశ్నించారు. ఉపాధిహామీ కూలీలు దేశ రాజధానిలో ధర్నా చేసే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

‘‘తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు బాగున్నాయని నీతి ఆయోగ్ చెప్పింది. మిషన్ కాకతీయకు రూ. 5 వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని చెబితే.. 24 పైసలు కూడా ఇవ్వలేదు. ట్యాక్స్‌లకు సెస్‌లనే పేర్లు మార్చి రాష్ట్రాల నిధులను కేంద్రం కొల్లగొడుతుంది. జీఎస్టీ బకాయిలు కూడా చెల్లించకుండా పెండింగ్‌లో పెడుతున్నారు’’ అని కేసీఆర్ మండిపడ్డారు. 

దేశంలో సహకార సమాఖ్య విధానం  పోయి  ఆదేశిత సమాఖ్య విధానం వచ్చిందని కేసీఆర్ విమర్శించారు. వారు చెప్పింది చేయకపోతే మీ కథ చూస్తాం అనే పరిస్థితికి వచ్చారని మండిపడ్డారు. బీజేపీ విధానాల వల్ల అంతర్జాతీయ భారత దేశం పరుపుపోతుందని అన్నారు. నీతి ఆయోగ్ రూపకల్పనలో ఎవ్వరి ప్రమేయం ఉండదని అన్నారు. రాష్ట్రాలకు రావాల్సిన రూ. 14 లక్షల కోట్లు నిధులు ఎగ్గొట్టారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రాల ప్రగతిని దెబ్బతిస్తున్నాయని మండిపడ్డారు. పంచాయితీరాజ్ విభాగంలో రాష్ట్రానికి 10 అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని శాఖలను నీతి ఆయోగ్ ప్రశంసించిందని చెప్పారు. కేంద్రం నుంచి ప్రశంసలే తప్ప.. నిధులు రాలేదని చెప్పారు. ఈ కారణం చేతనే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టుగా చెప్పారు. ఇది చూసైనా కేంద్రం తీరులో మార్పు రావాలని కోరుతున్నట్టుగా తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios