హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా కారణంగా మార్చి 25 నుంచి వివిధ దశల్లో లాక్ డౌన్ విధిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జూన్ 30 వరకు లాక్ డౌన్ అమలులో ఉన్నది. అయితే, లాక్ డౌన్ 5 లో సడలింపులు ఇవ్వడంతో దాదాపుగా అన్ని రకాల ఆఫీస్ లు, వ్యాపార సంస్థలు తెరుచుకున్నాయి. దీంతో రాష్ట్రానికి కొంతమేర ఆదాయం లభిస్తున్నది. 

అయితే, లాక్ డౌన్ పూర్తి స్థాయిలో అమలులో ఉన్న సమయంలో ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించలేకపోయింది ప్రభుత్వం. ఆదాయం లేకపోవడంతో కోతలు విధించింది. ఏప్రిల్, మే నెలల్లో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల్లో కోతలు పడ్డాయి.

అయితే, జూన్ నెల నుంచి ఉద్యోగుల జీతాల్లో కోతలు ఉండబోవడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఉద్యోగులతో పాటుగా పెన్షనర్ల పూర్తి పెన్షన్ ను ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖతను వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. 

రాష్ట్రంలో ఏవైనా విపత్తులు సంభవించి అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు ఏ వ్యక్తికైనా, సంస్థకైనా చెల్లింపులు వాయిదా వేసే అధికారం ప్రభుత్వానికి కల్పించేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు.