తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి చెందిన ఓ పెంపుడు కుక్క ఒకటి ఇటీవల మృతి చెందిన  సంగతి తెలిసిందే. కేసీఆర్  అధికార నివాసమైన ప్రగతిభవన్ లో పెంపుడు కుక్క హస్కీ  ఉండేది.   కాగా.. తాజాగా దాని  మృతి కేసును హైదరాబాద్ సిటీ పోలీసులు ఎట్టకేలకు మూసివేశారు.

 ఈ ఏడాది సెప్టెంబరు 10వతేదీన సీఎం పెంపుడు కుక్క మరణించడంతో, ప్రగతిభవన్ అధికారులు దీనిపై సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హస్కీ కుక్క మృతికి ఇద్దరు పశువైద్యాధికారుల నిర్లక్ష్యమే కారణమని పశువైద్యాధికారులు డాక్టర్ రంజిత్, లక్ష్మీలపై నగర పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీనిపై ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తూ, పెంపుడు కుక్క మృతి కేసులో పశువైద్యాధికారులపై నమోదైన క్రిమినల్ కేసును ఎత్తివేయాలని కోరింది. 

కాగా పెంపుడు కుక్క హస్కీ కళేబరాన్ని పోస్టుమార్టం చేయగా, అది సహజంగా అనారోగ్యంతోనే మరణించిందని తేలింది. దీంతో తాము ఇద్దరు పశువైద్యాధికారులపై పెట్టిన క్రిమినల్ కేసును మూసివేయాలని కోరుతూ హైదరాబాద్ సిటీ పోలీసులు స్థానిక కోర్టులో పిటిషన్ సమర్పించారు.

11 నెలల హస్కీ కుక్క అనారోగ్యానికి గురవడంతో దాన్ని బంజారాహిల్స్ క్లినిక్ లో చేర్చారు. హస్కీ చికిత్స పొందుతూ మరణించడంతో పశువైద్యాధికారుల నిర్లక్ష్యం వల్లే కుక్క మరణించిందంటూ పోలీసులు ఐపీసీ సెక్షన్ 429 సెక్షన్ 11 (4) కింద జంతువులపై క్రూరత్వ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దీనిపై ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ చిరంతన్ కడియన్ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. కుక్క మృతి కేసులో పశువైద్యాధికారులపై కేసు నమోదు చేయడంపై పలురు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీపై విమర్శలు కూశా చేశారు.