హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నేపథ్యం, రాష్ట్ర అవతరణ, కొత్త రాష్ట్రం ప్రస్థానం పూర్తిగా తెలిసిన గవర్నర్ నరసింహన్ సేవలు కోల్పోవడం అత్యంత బాధగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఎప్పటికప్పుడు వెన్నుతట్టి ధైర్యం చెప్పి స్ఫూర్తి నింపిన గవర్నర్ నరసింహన్ తో తనకు అనేక గొప్ప జ్ఞాపకాలున్నాయని ఆయన అన్నారు. 

రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులు ప్రతీ పండుగను గొప్ప వేడుకగా నిర్వహించేవారని, ఇప్పుడా నోరూరించే రుచులకు దూరం అవుతున్నామని చెప్పారు. నరసింహన్ ఇచ్చిన స్పూర్తిని, మార్గదర్శకత్వాన్ని ముందుకు తీసుకెళతామని కేసీఆర్ చెప్పారు. గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ ఆత్మీయ వీడ్కోలు సభ ప్రగతి భవన్ లో శనివారం ప్రగతి భవన్ లో జరిగింది. వీడ్కోలు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. 

గవర్నర్ తో తనకున్న అనుబంధాన్ని, ఎప్పటికప్పుడు అండగా నిలుస్తూ, ప్రోత్సహించిన విధానాన్ని చెప్పారు. తనకు ఓ పెద్దదిక్కులాగా, రాష్ట్రానికి మార్గదర్శకుడిగా వ్యవహరించిన గవర్నర్ పదవీ విరమణ చేసి వెళ్లిపోవడం బాధాకరంగా ఉందని చెప్పారు. ప్రసంగం మధ్యలో చాలా సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు.

"గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో మొదట సమైక్య ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా, తర్వాత రెండు రాష్ట్రాల గవర్నర్ గా, చివరికి తెలంగాణ గవర్నర్ గా నరసింహన్ మూడు రకాల బాధ్యతలు నిర్వర్తించారు. నేను ఉద్యమ కారుడిగా, ముఖ్యమంత్రిగా రెండు రకాల బాధ్యతలు నిర్వర్తించాను" అని కేసీఆర్ అన్నారు. "ఈ కాలంలో ఇద్దరి మధ్య అనేక గొప్ప జ్ఞాపకాలున్నాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో మాజీ ఐపిఎస్ అధికారి అయిన నరసింహన్ గవర్నర్ గా వచ్చారు. ఉద్యమాన్ని అణచివేయడానికే వచ్చారనే భయం నాడు కొందరిలో ఉండేది. అదే సమయంలో నేనే ఆయన్ను కలిశాను" అని చెప్పారు. 

"ఉద్యమ నేపథ్యాన్ని, ఇన్నేళ్లుగా ఉద్యమం సజీవంగా ఉండడానికి గల కారణాలను ఆయన ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగాధిపతిగా పనిచేసిన అనుభవం కలిగిన గవర్నర్ తెలంగాణ ఉద్యమం గురించి, ఇక్కడి ప్రజల డిమాండ్ గురించి కేంద్రానికి సరైన నివేదికలు పంపి న్యాయం చేస్తారనే నమ్మకం నాకున్నదని నేను తొలినాళ్లలోనే ఆయనపై విశ్వాసం వ్యక్తం చేశాను" అని సిఎం గుర్తు చేసుకున్నారు. 

"నరసింహన్ గవర్నర్  గా ఉన్న సమయంలోనే తెలంగాణ వచ్చింది. ఆయన హయాంలోనే టిఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఆయనతో ఎంతో అనుబంధం ఉంది. నేను తననో పెద్ద మనిషిలాగానే చూశాను. నన్ను కూడా ఆయన సిఎంలా కాకుండా, తమ్ముడిలా ఆదరించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల మంచి, చెడులను ఎప్పటికప్పుడు చర్చించేవారు. పథకాల ఉద్దేశ్యాలను తెలుసుకునే వారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వాకబు చేసేవారు" అని సిఎం అన్నారు. 

"కేసీఆర్ కిట్స్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, హరితహారం, మిషన్ భగీరథ లాంటి పథకాలు ఆయనకు ఎంతో బాగా నచ్చాయి. పేదలకు ఉపయోగపడుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడైనా కొంచెం బాధపడినా, ఇబ్బంది అనిపించినా వెన్ను తట్టి ధైర్యం చెప్పేవారు. ప్రజల మంచి కోసం పనిచేస్తున్నారు. మానవ ప్రయత్నం చేయండి. భగవంతుడి దీవెనలుంటాయని దీవించేవారు. తలపెట్టిన ప్రతీ పని విజయవంతం కావాలని తపన పడేవారు. స్పూర్తినింపే మాటలు చెప్పేవారు" అని అన్నారు. 

"రాజ్ భవన్ పోయిన ప్రతీసారి ఎంతో ఆత్మీయంగా మాట్లాడేవారు. అన్ని విషయాలు చర్చించేవారు. రాజ్ భవన్ ను ప్రజావేదికగా మార్చారు. ఎవరైనా వెళ్లి తమ సమస్యలు చెప్పుకోవడానికి వీలుకలిగేది. రాజ్ భవన్ వెళ్లేవారిని గవర్నర్ దంపతులు తల్లిదండ్రుల్లా ఆదరించేవారు. తెలంగాణ ప్రభుత్వం చేసే మంచి పనులకు కేంద్ర మంత్రులకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు గవర్నర్ వివరించేవారు. దానివల్ల మనకు మంచి ప్రశంసలు లభించేవి. తెలంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించడానికి చొరవ చూపారు" అని ముఖ్యమంత్రి అన్నారు.

"యాదాద్రి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టినప్పుడు గవర్నర్ దంపతులు ఎంతో నిష్టతో మడికట్టుకుని అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేను తల్లిదండ్రులను కోల్పోయాను. పెద్దన్న లేడు. పెద్దల ఆశీర్వాదం తీసుకుని మంచి పనికి శ్రీకారం చుట్టాలని భావించాను. నాకు గవర్నర్ దంపతులే పెద్దదిక్కుగా కనిపించారు. సోదరభావంతో వారికి పాదాభివందనం చేసి పని ప్రారంభించాను. అది విజయవంతగా కొనసాగుతున్నది" అని కేసిఆర్ అన్నారు. 

"నరసింహన్ గారు యాదాద్రి పనులు పూర్తయ్యాక మళ్లీ రావాలి. పూజలో పాల్గొనాలి. గవర్నర్ నరసింహన్ చూపిన ప్రేమ, అభిమానం జీవితాంతం గుర్తుండి పోతాయి" అని ముఖ్యమంత్రి అన్నారు. "నరసింహన్ కు ఇచ్చినట్లే వచ్చే గవర్నర్ కూడా అదే గౌరవం ఇస్తాం. రాజ్ భవన్ ప్రాశస్త్యాన్ని కాపాడుతాం" అని ముఖ్యమంత్రి చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నా ముందు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, డిజిపి మహేందర్ రెడ్డి, పిసిసిఎఫ్ శోభ మాట్లాడారు.