హైదరాబాద్: తన కేబినెట్‌‌లో హరీష్ రావుకు కేసీఆర్ అవకాశం కల్పించలేదు. మంగళవారం నాడు కేసీఆర్ కేబినెట్‌లో మంగళవారం నాడు 10 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ జాబితాలో హరీష్‌రావు పేరు లేదు. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్నందున హరీష్‌రావు పేరు కేబినెట్‌లో లేదని పైకి చెబుతున్నారు. 

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. డిసెంబర్ 13వ తేదీన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తనతో పాటు మహమూద్ అలీని కూడ మంత్రిగా ప్రమాణం చేయించారు. మహమూద్ అలీకి హోం మంత్రిత్వశాఖను కేటాయించారు.

అయితే కేసీఆర్ తన మంత్రివర్గాన్ని 60 రోజుల తర్వాత విస్తరిస్తున్నారు. ఇవాళ పది మందిని తన మంత్రివర్గంలోకి తీసుకొంటున్నారు.ఈ జాబితాలో తన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్‌రావులకు చోటు కల్పించలేదు.

గత టర్మ్‌లో మంత్రులుగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్‌లకు మాత్రమే కేసీఆర్ చోటు కల్పించారు. గత టర్మ్‌లో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్‌రావుకు ఈ దఫా విస్తరణలో చోటు దక్కలేదు.

కేసీఆర్ కేబినెట్‌లో కేటీఆర్ కు చోటు దక్కితే హరీష్ రావుకు కూడ చోటు కల్పించనున్నారు. కేటీఆర్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేసీఆర్ బాధ్యతలను అప్పగించారు. కానీ, హరీష్ రావుకు పార్టీలో ఎలాంటి పదవులు లేవు. ఇవాళ కేబినెట్‌లో కూడ హరీష్‌కు చోటు లేకుండా పోయింది.

ఇవాళ పదిమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తే మరో ఆరుగురికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేబినెట్ బెర్తులు దక్కే అవకాశం ఉంది. ఆ సమయంలో హరీష్ రావుకు కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగిస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. కేటీఆర్  సీఎంగా ఉంటే ఆ కేబినెట్ లో తాను మంత్రిగా పనిచేసేందుకు కూడ సిద్దమేనని హరీష్ రావు గతంలో ప్రకటించారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై కేంద్రీకరించనున్నారు. ఈ సమయంలో కేబినెట్లోకి కేటీఆర్ ను తీసుకొంటే ఇబ్బందులని భావించి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేటీఆర్ ను కేబినెట్ లోకి తీసుకొనే అవకాశం దక్కనుంది.

ఇదిలా ఉంటే మరో వైపు హరీష్‌ను వ్యూహత్మకంగా తప్పించే క్రమంలోనే కేబినెట్‌కు దూరంగా పెట్టారా అని కూడ ఆయన అనుచరులు కూడ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హరీష్‌రావు బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారని  కేబినెట్ విస్తరణకు ఒక్క రోజు ముందే రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

మరో వైపు పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్‌రావును ఎంపీగా పోటీ చేయిస్తారనే ప్రచారం కూడ ఉంది. అయితే ఈ విషయమై ఏదీ స్పష్టత రాలేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిపే విస్తరణలో హరీష్, కేటీఆర్‌లకు తప్పకుండా ఛాన్స్ దక్కే అవకాశం ఉందంటున్నారు. 

కేసీఆర్ కేబినెట్‌లోకి హరీష్, కేటీఆర్‌లకు ఒకే దఫా అవకాశం దక్కనుంది. ఇదిలా ఉంటే వ్యూహత్మకంగానే కేసీఆర్ హరీష్‌కు ఈ దఫా మంత్రి వర్గంలో చోటు కల్పించలేదనే ప్రచారం కూడ లేకపోలేదు. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి గత టర్మ్‌లో కేసీఆర్ ప్రాతినిథ్యం వహించినా కూడ హరీష్‌కు మంత్రి పదవిని ఇచ్చిన విషయాన్ని కూడ ఆయన వర్గీయులు గుర్తు చేస్తున్నారు.