Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్ టీడీపీ.. ఏపీ రాజకీయ నేతలపై కేసీఆర్ ఫోకస్..!

కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు ముహుర్తం ఖరారు అయింది. దసరా రోజున కేసీఆర్ కొత్త పార్టీపై ప్రకటన చేయనున్నారు. కొత్త పార్టీని పలు రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్న కేసీఆర్.. ఏపీలోని టీడీపీ నేతలు కొందరికి పార్టీలో చేరాలని ఆహ్వానాలు పంపినట్టుగా ప్రచారం జరుగుతుంది.

kcr new party likely to target tdp in andhra Pradesh reports
Author
First Published Oct 4, 2022, 10:50 AM IST

కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు ముహుర్తం ఖరారు అయింది. దసరా రోజున కేసీఆర్ కొత్త పార్టీపై ప్రకటన చేయనున్నారు. జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్దమవుతున్న కేసీఆర్.. తొలుత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లపై దృష్టి సారిస్తారనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌‌లో కేసీఆర్ అడుగుపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. టీఆర్ఎస్‌ పార్టీ ఏర్పడిందే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎజెండాతోనే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆంధ్ర రాజకీయ నేతలపైనే కాకుండా.. ఆంధ్ర ప్రజల ఆహారంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 

ఓ సందర్భంలో హైదరాబాదీ బిర్యానీ ఉత్తమమైనదని.. ఆంధ్రా ప్రజలు తయారుచేసే బిర్యానీ ‘ఆవు పేడ’లా ఉందని కేసీఆర్ చేసిన కామెంట్స్ అక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న కేసీఆర్.. ఆంధ్రలో కూడా తన పార్టీని విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్.. పలు సందర్భాల్లో ఏపీ రాజకీయాలపై స్పందించిన సంగతి తెలిసిందే. ఏపీలోనూ టీఆర్ఎస్‌ను పోటీ చేయమని అంటున్నారని.. గెలిపించుకుంటామని చెబుతున్నారని కేసీఆర్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేసీఆర్‌ను ప్రశంసలు కురిపిస్తూ ఏపీలో పలు సందర్భాల్లో ఫ్లెక్సీలు దర్శనిమిచ్చాయి. అయితే ఇప్పుడు కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టబోతున్నరానే వార్తల నేపథ్యంలో.. గతంలో చోటుచేసుకున్న పరిణామాలన్నీ చర్చనీయాంశాలుగా మారాయి.

అయితే ఏపీలో అధికారమే లక్ష్యంగా కాకపోయినప్పటికీ.. పార్టీకి ఓట్ల శాతం, కొన్ని స్థానాల్లో గెలుపొందడమే కేసీఆర్ ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. జాతీయ పార్టీ హోదా పొందాలంటే నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం చెల్లుబాటు అయ్యే ఓట్లను పొందాల్సి ఉంటుంది. ఇందుకోసమే కేసీఆర్ ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కొత్త పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపేందుకు సిద్దమయ్యారు. 

ఏపీపై ఫోకస్ చేసిన కేసీఆర్.. ప్రధానంగా అక్కడి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గతంలో కేసీఆర్ టీడీపీలో పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ సీనియర్లలలో కొందరి తనకు పరిచయాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే గతంలో తనతో కలిసి పనిచేసిన వారి వివరాలను కేసీఆర్ సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే  పలువురు నేతలకు కేసీఆర్ నుంచి పిలుపువచ్చినట్లు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలోని కొప్పుల వెలమ సామాజికవర్గం నేతలతో కేసీఆర్, టీఆర్ఎస్ ముఖ్య నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

అలాగే సామాజిక సమీకరణాల కారణంగా పార్టీలో టికెట్లు దక్కనివారిని, రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముఖ్య నేతల వివరాలు కూడా కేసీఆర్ సేకరించాలని.. తన కొత్త పార్టీలో చేరాలని కోరుతూ వారికి ఆహ్వానాలు కూడా పంపారనే ప్రచారం జోరుగా సాగుతుంది. కొద్ది నెలల క్రితం కేసీఆర్.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ కావడం కూడా ఏపీలో కొత్త పార్టీ విస్తరణలో భాగమని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని ఉండవల్లి ఖండించారు. జాతీయ పార్టీ గురించి తమ భేటీలో ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. తనుకు రాజకీయాల్లో కొనసాగే ఆసక్తి లేదన్నారు. బీజేపీ వ్యతిరేకులను ఏకంచేసే శక్తి కేసీఆర్‌కు ఉందని అన్నారు. 

మరోవైపు కేసీఆర్ వ్యుహాంలో భాగంగానే.. ఏపీలో పరిస్థితులు బాగోలేవని హరీష్ రావుతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు కామెంట్స్ చేస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ కంటే తెలంగాణ అభివృద్దిలో దూసుకుపోతుందని.. కేసీఆర్ పాలన గొప్పగా ఉందనే సంకేతం పంపడం కోసమే టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల వెనక ఉద్దేశమని వారు అభిప్రాయపడుతున్నారు. మరి కేసీఆర్ కొత్త పార్టీలో ఏపీలో ఏ మేరకు స్పందన ఉంటుంది?.. టీడీపీ నాయకులు ఆ పార్టీలో చేరతారా? అనేది కొద్ది రోజుల్లోనే తెలియనుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios