Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన ఇప్పట్లో లేనట్టేనా?.. టీఆర్ఎస్ వర్గాలు ఏం చెబుతున్నాయంటే..

జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దసరా రోజున పార్టీ ప్రకటన ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. 

KCR national party launch likely to postponed
Author
First Published Sep 21, 2022, 9:44 AM IST

జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నారు. ఆయన దసరాకు (అక్టోబర్ 5వ తేదీన) పార్టీ ప్రకటన చేయనున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దసరా రోజున పార్టీ ప్రకటన ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో కేసీఆర్ కొత్త పార్టీ అధికారికంగా ప్రారంభించబడుతుందని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త పార్టీ మేనిఫెస్టో తయారీలో జాప్యం, నీరు, విద్యుత్, వ్యవసాయం వంటి కీలక అంశాలపై విధానాలను చక్కదిద్దడం, నిపుణుల బృందాలతో పార్టీ జెండాను రూపొందించడం వంటివి.. పార్టీ ప్రకటన వాయిదాకు కారణాలుగా ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. 

వివిధ రంగాల్లోని నిపుణులతో బ్యాక్‌ గ్రౌండ్ వర్క్, సమావేశాలు జరుగుతున్నాయని టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత చెప్పినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. అలాగే కొత్త పార్టీ ఏర్పాటులో భాగంగా కేసీఆర్.. ప్రతిరోజూ వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు, రైతులను కలుస్తున్నారని ఆ నేత పేర్కొన్నారు. 

మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘంలో పార్టీ నమోదు ప్రక్రియ కూడా ఇంకా ప్రారంభం కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత జాతీయ పార్టీలో టీఆర్‌ఎస్‌ను విలీనం చేసేందుకు పార్టీ నాయకత్వం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి తీర్మానం చేయాల్సి ఉంటుందని.. ఈ విలీన తీర్మానం కాపీని ఎన్నిక సంఘానికి సమర్పించాల్సి ఉంటుందని ఆ వర్గాలు చెప్పుకొచ్చాయి.

ముహుర్తాలు లేకపోవడం కూడా కారణమా..?
కేసీఆర్ జ్యోతిష్యాన్ని నమ్ముతారనే సంగతి తెలిసిందే. ఆయన ఏదైనా పనిని చేపట్టడానికి మంచి ముహుర్తం ఉండేలా జాగ్రత్త పడతారు. ఈ క్రమంలోనే కొత్త పార్టీ ప్రకటనలో జాప్యం జరుగుతుందని చెబుతున్నారు. ‘‘ముఖ్యమైన పనులను ప్రారంభించేందుకు ఒకే ఒక శుభ దినం (అక్టోబర్ 5) అందుబాటులో ఉంది. ప్రస్తుత కాలం మూఢం.. ఇది ఏ పనికైనా(వివాహాలకు,  కార్యక్రమాలకు..) అశుభమైనదిగా పరిగణించబడుతుంది. ఇది డిసెంబర్ 2న ముగుస్తుంది. డిసెంబర్‌లో కూడా వారం రోజుల పాటు అంటే డిసెంబర్ 12 వరకు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. తర్వాతి దశ మంచి ముహూర్తాలు ఫిబ్రవరిలో మాత్రమే వస్తాయి’’ అని పండిట్ రామగుడు కళ్యాణ శర్మ తెలిపినట్టుగా టీవోఐ రిపోర్టు చేసింది. 

కొత్తగా నిర్మిస్తున్న సచివాలయ ప్రారంభోత్సవం డిసెంబర్ నెలకు వాయిదా పడినందున.. కేసీఆర్ కొత్త పార్టీ ఆవిర్భావాన్ని కూడా డిసెంబర్‌ నెలలోనే ఉండవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios