హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం మీదనే తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నారు. 

దాంతో తెలంగాణ లోకసభ ఎన్నికలపై ఎక్కువగా దృష్టి పెట్టలేదని అంటున్నారు. తెలంగాణ లోకసభ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతను పూర్తిగా తన తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు అప్పగించారు. 

2018 ఎన్నికల ఫలితాలు వెలువడే గానే జరిగిన ప్రెస్ మీట్ లో.. చంద్రబాబు ఇక్కడ ప్రచారం చేశారు, మీరు ఏపీలో అడుగుపెడతారా? అని ఓ రిపోర్టర్ కేసీఆర్ ని ప్రశ్నించగా..తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యంగ్యంగా అన్నారు. అన్నట్లుగానే చంద్రబాబును గద్దె దింపే రిటర్న్ గిఫ్ట్ ను సక్సెస్ ఫుల్ గా ఇచ్చారు. అందుకే కాబోలు జగన్ ఎన్నికల ఫలితాలు వెలువడగానే మొదట కలిసిన ముఖ్య నేత కేసీఆరే అయ్యారు.  

తన వనరులను, వ్యూహాలను పకడ్బందీగా వాడి ఆంధ్రప్రదేశ్ జగన్ విజయం కోసం పనిచేశారని అంటారు. కానీ దీనిపై అతిగా సమయం వెచ్చించడం వల్ల సొంత రాష్ట్రంలో 16 స్థానాలకు గాను 16 గెల్చుకొని తనకు తాను ఒక ఫుల్ సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకుందాం అనుకున్నప్పటికీ కేవలం హాఫ్ గిఫ్ట్ మాత్రమే దక్కిందని పండితులు విశ్లేషిస్తున్నారు. 

దీనిని బలపరుస్తూ ఎపి ఎన్నికలకు ముందు కేసీఆర్ ఏపీకి చెందిన బడా వ్యాపారులను, పారిశ్రామికవేత్తలను హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న టీడీపీ ఎమ్మెల్యే లను బెదిరించి వైసిపిలో చేర్పిస్తున్నారని పవన్, చంద్రబాబు పదే పదే చేసిన ఆక్షేపణలను వారు గుర్తు చేసుకున్నారు. 

మొత్తానికి ఏది ఏమైనప్పటికి 16/16 సీట్లను గెలవాల్సిన టీఆరెస్ పార్టీ కేవలం 9 సీట్లకే పరిమితమవ్వడం అందులోను తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు, టీఆర్ఎస్ పార్టీ కంచుకోట అయిన ఉత్తర తెలంగాణలో పార్టీకి గండిపడడమే కాకుండా కేసీఆర్ కూతురు కవిత ఓడిపోయారు.