తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు హరితహారం పథకం ద్వారా చెట్లను అడవులను కాపాడుతుండగా...మరోవైపు కలప స్మగ్లర్లు అడవులను నరికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నారు. ఇలా ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ అక్రమంగా అటవీ సంపదను దోచుకుంటున్న స్మగ్లర్లపై కఠిన చర్యలు  తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 

ఎట్టి పరిస్థితుల్లో కలప స్లగ్లింగ్ కాకుండా చూడాలని అటవీ శాఖ అధికారులకు ఆయన సూచించారు. పోలీసుల సహకారంతో కలప స్మగ్లరపై ఉక్కుపాదం మోపాలని...తరచూ స్మగ్లింగ్ కు పాల్పడే వారిపై పి.డి. యాక్టు నమోదు చేయాలని ఆదేశించారు. అటవీ సంపదను అక్రమంగా నాశనం చేస్తున్న వారు ఎంత పలుకుబడి కలిగిన వ్యక్తులయినా, ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. 

తెలంగాణలో పర్యావరణ పరిరక్షణను నాలుగు విభాగాలుగా విభజించుకుని చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కల పెంపకం, అడవి పునరుద్ధరణ, హైదరాబాద్ నగరం లోపలా బయటా పచ్చదనం పెంచడం, కలప స్మగ్లింగ్ అరికట్టడంపై కార్యాచరణ రూపొందించుకుని రంగంలోకి దిగాలని సిఎం సూచించారు. 

పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకంపై ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో హోం మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, సిఎస్ ఎస్.కె.జోషి, డిజిపి మహేందర్ రెడ్డి, పిసిసిఎఫ్ పి.కె.ఝా,  సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, రాజీవ్ త్రివేది, నిరంజన్ రావు, స్మితా సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్, పలువురు అటవీశాఖ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. 
 
అడవుల రక్షణకు సాయుధ పోలీసుల సహకారం తీసుకుని స్మగ్లింగ్ ను నూటికి నూరు శాతం అరికట్టాలని సీఎం ఆదేశించారు. కలప స్మగ్లింగుకు పాల్పడే వారిపైనే కాదు అందుకు సహకరించే అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ నాయకులు ఎవరైనా స్మగ్లింగ్ కు పాల్పడినా వదిలిపెట్టవద్దని... టిఆర్ఎస్ నాయకులు ఎవరైనా ఈ పనిచేస్తే ముందు వారిపైనే చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించారు.