హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. తన మంత్రివర్గాన్ని ఆయన ఈ నెల 10వ తేదీన విస్తరిస్తారని అంటున్నారు. తుది జాబితాపై ఆయన కసరత్తు చేస్తున్నారు.

పలువురు సీనియర్లకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు చోటు దక్కే అవకాశాలు లేవని అంటున్నారు. పార్టీ పదవులు నిర్వహించే వారికి మంత్రి పదవులు ఉండవని కేసీఆర్ గతంలోనే చెప్పారు. ఈ కారణంతో ఆయన కేటీ రామారావుకు మంత్రి పదవిని ఇవ్వకపోవచ్చునని అంటున్నారు.

అదే సమయంలో తన మేనల్లుడు, సీనియర్ శాసనసభ్యుడు హరీష్ రావుకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతోంది. ఎక్కువగా కొత్తవాళ్లకు ఆయన మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని అంటున్నారు. 

తాను ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన సమయంలో మొహమ్మద్ అలీని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. హరీష్ రావును చాలా కాలంగా కేసీఆర్ దూరం పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ ను తన వారసుడిగా నిలబెట్టే క్రమంలో హరీష్ రావు పాత్రను తగ్గిస్తూ వస్తున్నట్లు చెబుతున్నారు.