హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను కేంద్రం అప్రజాస్వామికంగా ఇచ్చిందని ఆయన విమర్శించారు. సీలేరు ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు తీవ్రమైన నష్టం చేశారని ఆయన అన్నారు. 

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, సింగరేణి కార్మికులకు ఐటి రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతామని, తమ ఎంపీలు పార్లమెంటులో ఈ విషయంపై పోరాటం చేస్తారని ఆయన అన్నారు. సింగరేణి కారుణ్య నియామకాలపై ఆయన శాసనసభలో స్పందించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అర్హత ఉన్నవారికి కచ్చితంగా ఉద్యోగులు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. 

ఇదిలావుంటే, కొత్త రెవెన్యూ చట్టం బిల్లుపై ఆయన సోమవారంనాడు శాసన మండలిలో మాట్లాడారు. వీఆర్వోలకు అనవసరమైన అధికారులు ఇచ్చారని, వీఅర్వో ఉద్యోగాలకు ప్రాధాన్యత లేదని, ఆ పోస్టులు రద్దయ్యాయని కేసీఆర్ చెప్పారు. భూముల ధరలు పెరగడంతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో భూస్వాములు, జాగీర్దార్లు లేరని ఆయన అన్నారు. కొంత మంది నాయకులు బయట అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ బిల్లు వల్ల భూస్వాములకు లాభం జరుగుతుందని అంటున్నారని, తెలంగాణలో భూస్వాములు లేరని ఆయన అన్నారు