Asianet News TeluguAsianet News Telugu

ఏపీపై కూడా కేసీఆర్ గురి.. మొత్తంగా 100 స్థానాలు టార్గెట్.. బీఆర్ఎస్ ఎన్నికల వ్యుహం ఇదేనా..!

జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు తగ్గట్టుగా భారీ ప్రణాళికలను రచిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే క్రమంలో తొలుత కొన్ని రాష్ట్రాలను కేసీఆర్ టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. 

KCR likely to Focus on these lok sabha seats including Andhra Pradesh
Author
First Published Nov 8, 2022, 10:36 AM IST

జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు తగ్గట్టుగా భారీ ప్రణాళికలను రచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును  భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఆమోదించిన తీర్మానాన్ని.. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా అందజేశారు. తాజాగా పార్టీ పేరు మార్పుపై అభ్యంతరాలు ఉంటే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలపాలని పబ్లిక్ నోటీసు కూడా జారీ చేసింది. ఇదిలా ఉంటే.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే క్రమంలో తొలుత కొన్ని రాష్ట్రాలను కేసీఆర్ టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. 

భారత రాష్ట్ర సమితి తరపున 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని దాదాపు 100 పార్లమెంట్ నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలపాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌లలోని అన్ని పార్లమెంట్ స్థానాలతో పాటు.. మహారాష్ట్ర, కర్ణాటకలలోని సరిహద్దు నియోజకవర్గాలపై కేసీఆర్ దృష్టిసారించినట్టుగా గులాబీ పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఎన్నికల ఖర్చు తక్కువగా ఉండే పార్లమెంట్ స్థానాల నుంచి అభ్యర్థులను బరిలో నిలపాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

ఎందుకంటే దేశంలోని  కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చు అధికంగా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఖర్చు తక్కువగా ఉందనేది వాస్తవం. అలాంటి చోట్ల ఆర్థిక వనరులను సమకూర్చి.. వ్యక్తిగతంగా బలం ఉన్న నాయకులను, ఇతర పార్టీల నుంచి టికెట్స్ దక్కని ముఖ్యమైన నాయకులను బరిలో దింపితే మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 

అయితే మిత్రపక్షాలను ఏర్పరుచుకున్నప్పటికీ.. సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 543 స్థానాల్లో పోటీ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. అభ్యర్థులు ఎంపిక, ఆర్థిక వనరులు.. ఇలా అనేక సమస్యలు ఉంటాయి. ఈ క్రమంలోనే తొలుతు కొన్ని స్థానాలపై ఫోకస్ చేసి అక్కడ బలం నిరూపించుకుంటే.. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా మరింత మైలేజ్ పొందవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే.. 100 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నింపి.. తెలంగాణలోని 17 స్థానాలతో పాటు మరో 50 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తే.. అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలుచుకున్న పార్టీలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంటుందని గులాబీ పార్టీ వర్గాలు తెలిపాయి. 

ఇక, ఇప్పటివరకు బీఆర్ఎస్ భవిష్యత్ కార్యచరణను, ప్రణాళికలను మాత్రం కేసీఆర్ వెల్లడించలేదు. అయితే భవిష్యత్ కార్యచరణకు సంబంధించిన అన్ని వివరాలను కేసీఆర్ డిసెంబర్‌లో వెల్లడిస్తారని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios