నల్గొండ: దేశ రాజకీయాల్లో  చక్రం తిప్పాలని  చూస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్  త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి బరిలో దిగే అవకాశాలున్నాయని సమాచారం. ఈ స్థానం నుండి ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉంది.

కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ తలపెట్టారు. ఈ మేరకు ఒడిశా, బెంగాల్ సీఎంలతో కేసీఆర్ ఇప్పటికే సమావేశమయ్యారు. మిగిలిన పార్టీలతో కూడ  కేసీఆర్ సమావేశం కానున్నారు.

అయితే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అవకాశం  ఉంది.ఈ పార్లమెంట్ ఎన్నికల్లో  కూడ కేసీఆర్ పోటీ చేయాలని భావిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో ఎంపీ సీట్లు దక్కకపోతే చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్నారు.

ఈ ప్రక్రియలో భాగంగా  కేసీఆర్  ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో   ప్రాంతీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.  అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లో ఎక్కువ కాలం గడిపే అవకాశం ఉంది.

ఈ కారణంగానే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ  ఎంపీ స్థానం నుండి కేసీఆర్ పోటీ చేస్తారనే ప్రచారం కూడ ఉంది. ప్రస్తుతం నల్గొండ ఎంపీగా గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

సుఖేందర్ రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి పదవిని ఇస్తామని సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ హామీ ఇచ్చినందునే ఆయన పార్టీ మారారని అప్పట్లో  ప్రచారం సాగింది.

సుఖేందర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించారు. ఈ పోస్టుకు కేబినెట్ హోదాను కల్పించారు. అయితే ఈ దఫా సుఖేందర్ రెడ్డికి  మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.

నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి ఇప్పటికే ఖాళీగా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో  ఈ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానం నుండి లేదా గవర్నర్ కోటాలోనైనా సుఖేందర్ రెడ్డిని ఎమ్మెల్సీని చేసి కేబినెట్‌లోకి తీసుకొనే అవకాశం లేకపోలేదు.

కేసీఆర్ ఫిబ్రవరిలో  మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. తొలి విడతలో తీసుకొనే 8 మందిలో కేసీఆర్ సుఖేందర్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వనున్నారు.  మరో వైపు నల్గొండ నుండి కేసీఆర్ ఎంపీగా బరిలోకి దిగనున్నారు. నల్గొండ నుండి కేసీఆర్ ఎంపీగా పోటీ చేయడం ద్వారా జిల్లాలో ప్రభావం ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 

కేసీఆర్ కాకుండా మరో నేతను ఈ స్థానం నుండి బరిలోకి దింపితే ఈ స్థానం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొంటుందనే భావనతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఈ కారణంగానే కేసీఆర్  నల్గొండ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు కేసీఆర్ ఈ స్థానం నుండి పోటీ చేయడం వల్ల  భువనగరి పార్లమెంట్ స్థానంపై కూడ ఆ ప్రభావం ఉంటుందని  టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.

 నాగార్జున సాగర్  అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేసి ఓటమి పాలైన జానారెడ్డి  నల్గొండ స్థానం నుండి  ఈ దఫా ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉంది. భువనగరి నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ చేయనున్నారు. 

నల్గొండ నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీలోని ఇతర నేతలు  సహకరించకపోవచ్చనే వాదన కూడ లేకపోలేదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలమైన వాతావరణం ఉందనే ప్రచారం నెలకొన్న నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కూడ నల్గొండ నుండి పోటీకి సిద్దమయ్యారు.

2009 ఎన్నికల్లో భువనగరి పార్లమెంట్ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ఐదు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అతి స్వల్వ ఓట్లతో ఓటమి పాలయ్యారు. దీంతో  ఈ స్థానం నుండి పోటీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తిగా ఉన్నారు.

రాష్ట్రంలోని హైద్రాబాద్ ఎంపీ స్థానం మినహా మిగిలిన 16 స్థానాలను కైవసం చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. 16 ఎంపీ స్థానాలను గెలుచుకొంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మంచి అవకాశం ఉంటుందని గులాబీ దళపతి ప్లాన్. దరిమిలా కేసీఆర్ నల్గొండ నుండి పోటీకి సిద్దమయ్యారని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

కేబినెట్‌లో బెర్త్ ఖాయం:ఆ నేతలకు కేసీఆర్ హామీ?

ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఆ ఎనిమిది మంది వీరే

ఎన్నికల ఎఫెక్ట్: ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ

నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

ఈ సారైనా ఆ నలుగురికి కేబినెట్ బెర్త్ దక్కేనా