హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్య నిషేధం తెలంగాణ పాలిట వరంగా మారనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశలవారీగా మద్యపానాన్ని నిషేధించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైన్ షాపులను తగ్గించి, వాటిని తానే నడపాలని నిర్ణయం  తీసుకుంది. 

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంతో ఎపి లిక్కర్ కాంట్రాక్టర్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఉన్నారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న తెలంగాణ జిల్లాల్లో వాళ్లు మద్యం వ్యాపారం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో వాళ్లు మద్యం వ్యాపారం చేయడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. 

ఎపి కాంట్రాక్టర్ల ఆసక్తిని సొమ్ము చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా వైన్ షాపుల అనుమతికి చేసుకునే దరఖాస్తుల ఫీజులు పెంచేసింది. ఎపిలో దాదాపు 4 వేల షాపులున్నాయి. వాటిని 2 వేలకు కుదించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో దాదాపు 2,240 వైన్ షాపులున్నాయని, వాటి సంఖ్యను పెంచాలనేది కేసీఆర్ ప్రభుత్వ ఆలోచనన. 

తెలంగాణ ఆబ్కారీ సంవత్సరం అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జులైలో ప్రారంభం కావాల్సి ఉండింది. ఎన్నికల కారణంగా లైసెన్స్ కాలాన్ని మరో మూడు నెలలు పొడగించింది. దాంతో ఎపిలో కూడా ఆబ్కారీ విధానం అక్టోబర్ లోనే ప్రారంభమవుతుంది.

తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల దరఖాస్తు ఫీజును వసూలు చేస్తోంది. ఇది తిరిగి ఇచ్చేది కాదు. దరఖాస్తు ఫీజు ద్వారానే తెలంగాణ ప్రభుత్వానికి గత ఆబ్కారీ సంవత్సరంలో రూ.300 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఎపి కాంట్రాక్టర్లు కూడా పోటీకి వస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ ఫీజును 2 లక్షల రూపాయలకు పెంచే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.