Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ జగన్ కు కేసీఆర్ షాక్: సింగరేణివాటాపై నో చెప్పిన తెలంగాణ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు (YS Jagan) తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) షాక్ ఇచ్చారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో వాటా కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన డిమాండ్‌ను తెలంగాణ ప్రభుత్వం బుధవారం తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే.. ఆంధ్రప్రదేశ్‌ హెవీ మెషినరీ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌  విషయంలో కూడా తెలంగాణ సర్కార్ తన వైఖరిని స్పష్టం చేసింది.
 

KCR Gives Shock To Jagan Telangana Govt rejects Andhra Pradesh Appeal for Singareni Collieries share
Author
Hyderabad, First Published Jan 13, 2022, 11:34 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు (YS Jagan) తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) షాక్ ఇచ్చారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో వాటా కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన డిమాండ్‌ను తెలంగాణ ప్రభుత్వం బుధవారం తీవ్రంగా వ్యతిరేకించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా నేతృత్వంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు సోమేశ్ కుమార్, సమీర్ శర్మలతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభజన సమస్యలపై విస్తృతమైన చర్చ జరిగింది. 

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం సింగరేణి సంస్థలో తెలంగాణకు 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉంది.. ఈ అంశంలో పునర్విభజన చట్టాన్ని సవరించాలని ఏపీ అధికారులు కోరారు. దీనిని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘SCCL యొక్క మొత్తం ఈక్విటీలో 51 శాతం తెలంగాణ ప్రభుత్వం వద్ద.. 49 శాతం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంటుంది. చట్టంలో నిర్దిష్ట నిబంధన ఉన్నందున కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి AP ప్రభుత్వం లేవనెత్తిన ఏ అభ్యర్థనను స్వీకరించకూడదు’ అని సోమేశ్ కుమార్ చెప్పారు. అలాగే విజయవాడలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ హెవీ మెషినరీ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ (AP Heavy Machinery Engineering Ltd) తెలంగాణలోని సింగరేణికి అనుబంధ సంస్థ అని, భవిష్యత్తులోనూ అది అనుబంధ సంస్థగా కొనసాగుతుందని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. 

అయితే SCCL, APHMEL లపై తెలంగాణ అభిప్రాయంతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా ఏకీభవించారని ఈ సమావేశం తర్వాత విడుదల చేసిన ప్రతికా ప్రకటనలో సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలను పరస్పర చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోకుండా ఏపీ ప్రభుత్వం కోర్టులను ఆశ్రయించి స్టే ఉత్తర్వులు తెచ్చుకోవడం ద్వారా అడ్డుకుందని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఏడున్నరేళ్లు దాటిన రాష్ట్ర విభజనకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కారం కాకపోవడానికి ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొంది. ఈ కేసులను ఉపసంహరించుకోవాలని తెలంగాణ అధికారులు డిమాండ్‌ చేశారు. 

డిస్కమ్‌ల బకాయిలపై దావాలు
టీఎస్ డిస్కమ్‌ల నుంచి ఏపీ జెన్‌కోకు విద్యుత్ బకాయిల చెల్లింపు, 9,10 షెడ్యూల్‌లోని సంస్థల వివాదాలు, ఏపీఎస్‌ఎఫ్‌సీ (ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌), న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌, నగదు నిల్వలు, బ్యాంకు డిపాజిట్ల విభజన, పన్ను బకాయిలు, రీఫండ్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ముందు వాదనలు వినిపించింది. తెలంగాణ విద్యుత్తు సంస్థలకు ఏపీ జెన్‌కో రూ. 12,111 కోట్లు బకాయిపడిందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అయితే ఇదే సమయంలో ఏపీ జెన్‌కోకు తెలంగాణ రూ. 3,442 కోట్లు బకాయిపడిందని ఏపీ వాదించింది. ఈ క్రమంలోనే ఏపీ విద్యుత్‌శాఖ హైకోర్టులో కేసు వేసింది. అయితే ఈ మొత్తాలను తేల్చేందుకు.. ఏపీ ప్రభుత్వం కేసును ఉపసంహరించుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసింది.

9వ షెడ్యూల్‌లోని సంస్థలపై ..
డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (DILL)కి కేటాయించిన భూముల్లో నిబంధనలు ఉల్లంఘించిన 5 వేల ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి స్టే ఆర్డర్ పొందింది. అలాగే ఏపీఎస్‌ఎఫ్‌సీ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం షరతులు ఉల్లంఘించి సంస్థకు కేటాయించిన 250 ఎకరాల స్వాధీన అంశంపై కూడా ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు కేసుల కారణంగా 9 షెడ్యూల్ సంస్థల విభజన సమస్య మొత్తం పెండింగ్‌లో ఉంది. అందువల్ల ఏపీ సర్కార్.. కోర్టు కేసులను ఉపసంహరించుకుంటే తప్ప 9వ షెడ్యూల్ సంస్థల విభజనపై మరింత పురోగతి సాధించలేమని తెలంగాణ ప్రభుత్వం తమ వైఖరిని వెల్లడిచింది. 

10వ షెడ్యూల్‌లోని సంస్థలపై..
10వ షెడ్యూల్‌లోని సంస్థలకు సంబంధించిన వివాదాలపై తెలంగాణ ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ.. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా 2017లో కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వును జారీ చేసిందని తెలిపింది. ఈ ఉత్తర్వులో ఉన్న  సూత్రాన్ని 10వ షెడ్యూల్‌లోని అన్ని సంస్థలకు వర్తింప జేయాలని కోరింది. అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే తప్ప 10వ షెడ్యూల్‌లోని విద్యాసంస్థలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించలేమని తెలంగాణ అభిప్రాయపడింది. 

ఏపీ భవన్ విభజనకు కమిటీ..
ఢిల్లీలోని ఏపీ భవన్‌ తమకే చెందుతుందని తెలంగాణ వాదిస్తుండగా.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులను రెండు తెలుగు రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన పంచాలంటూ ఏపీ కోరుతోంది. తాజా సమావేశంలో.. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ విభజన వివాదానికి సంబంధించి తెలంగాణ రెసిడెంట్‌ కమిషనర్‌తో పాటుగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ, ఏపీకి చెందిన అవే విభాగాల అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇందుకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఏకీభవించినట్టుగా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. 

ఏపీ భవన్ విభజనకు కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం  తరఫున చేసిన ప్రతిపాదనను కేంద్రం అంగీకరించింది. రెండు రాష్ట్రాల ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, రెసిడెంట్  కమిషనర్లు, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీలతో కూడిన కమిటీ విభజన మార్గాలపై అద్యయనం చేస్తుంది. ఈ కమిటీ అధ్యయనం చేసి నిర్దేశిత గడువులోగా నివేదిక సమర్పించాలని హోం సెక్రటరీ ఆదేశించారు.

పన్ను బకాయిలు..
పన్ను బకాయిలు, రీఫండ్‌ల విభజనకు సంబంధించి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 50, 51, 56 లతో పాటుగా, సంస్థల విభజన చట్టంలో ఎక్కడా జాబితా చేయబడలేదు. ఈ క్రమంలోనే సవరణ చేపట్టాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నగదు నిల్వలు, బ్యాంకు డిపాజిట్ల విభజనకు సంబంధించి ఏపీ నుంచి రావాల్సిన నిధులను వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేసింది.

ఇక, కేంద్ర రంగ పథకాలకు సంబంధించి రూ. 495 కోట్లు బకాయి ఉందని, హైకోర్టు, రాజ్‌భవన్‌ తదితర సంస్థలపై నిర్వహణ వ్యయాలకు సంబంధించి రూ. 315 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలంగాణ తెలిపింది. అయితే నిర్మాణంలో ఉన్న భవనాల వాటా సొమ్ముతో పాటు సంక్షేమ నిధికి సంబంధించి  రూ.456కోట్లు రావాల్సి ఉందని గుర్తుచేసింది. నికర అప్పుకు సంబంధించి రూ.208కోట్లు రావాల్సి ఉందని చెప్పింది.

నగదు నిల్వల విభజనను పరిశీలించేందుకు ఇద్దరు నోడల్ అధికారులను నియమించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా సూచించారు. ఇందుకు తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామ కృష్ణారావును నామినేట్ చేయగా, ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్‌ను నామినేట్ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios