ఆంధ్రాను జయించిన కేసిఆర్..

ఇదేంటి ఆంధ్రోళ్ల బద్ధ శత్రువు కేసిఆర్ ఆంధ్రాను జయించడమేంటి అని డౌట్ వస్తుంది కదా? నిజమేనండి తెలంగాణ సిఎం కేసిఆర్ ఆంధ్రాను జయించారు. ఎట్లెట్ల జయించారో ఈ స్టోరీ చదివితే మీకే తెలుస్తుంది.

గత రెండు దశాబ్దాలుగా సీమాంధ్ర వాళ్లకు కేసిఆర్ అంటే కోపం, పగ, కసి, ఆగ్రహం ఉన్నమాట నిజమే. కేసిఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిననాటినుంచి ఇప్పటివరకు వందలు, వేలు, లక్షల తిట్లు తిన్నమాట నిజమే. సీమాంధ్ర ప్రజలు, నాయకులు అందరూ కేసిఆర్ ను తిట్టిన దాఖలాలున్నాయి. అంతెందుకు తొలినాళ్లలో తెలంగాణ వాళ్లు కూడా కేసిఆర్ మీద దుమ్మెత్తిపోశారు. అంతిమంగా ఎవరు అవునన్నా.. కాదన్నా.. తెలంగాణ సాధన జరిగింది. తెలంగాణ సాధించడంలో కేసిఆర్ ఒక్కడిదే క్రెడిట్ కాకపోవచ్చు.. కానీ కేసిఆర్ లేకుండా తెలంగాణ రాకపోతుండే.

సరే తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రోళ్ల మనసు మారింది. ఇంతకాలం తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టిన కేసిఆర్ పై వాళ్ల వైఖరిలో మార్పు వచ్చింది. ఇప్పుడు తిట్లు బందు చేశారు. తిట్లు బందు చేశారంటే కారణం అభిమానం షురూ అయిందనే కదా? గత కొద్దిరోజులుగా అయితే కేసిఆర్ మీద అభిమానం ఉరకలు వేస్తున్నది. మొన్నటికి మొన్న విజయవాడలో కేసిఆర్  సంబంధం లేనోళ్లు కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం జరిపించారు. అంతకుముందు పరిటాల శ్రీరాం పెళ్లికి కేసిఆర్ పోతే.. చంద్రబాబు కంటే ఎక్కువగా కేసిఆర్ పై అభిమానం కురిపించారు.

ఈరెండు సంఘటనలే కాదు.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో కొందరు యువకులు కేసిఆర్ మీద అభిమానం చాటుకున్నారు. ఆ జిల్లాలో ఏకంగా కేసిఆర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో మధ్యలో మోడీ.. ఇటు కేసిఆర్, అటు చంద్రబాబు ఫొటో పెట్టి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో ఈ ఫ్లెక్సీ ఏర్పాటైంది. అందుకూరి వెంకటేశ్వర్లు, కూరాటి చిన్న ఇద్దరూ కలిసి ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ గ్రామంలో ఈ ఫ్లెక్సీపై జోరుగ చర్చోపచర్చలు సాగుతున్నాయి.

మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాన సిఎం కేసిఆర్ మీద ఆంద్రోళ్లకు అభిమానం రోజురోజుకూ పెరిగిపోతున్నమాట వాస్తవం. ఎంతలా పెరిగిపోతుందంటే.. తెలంగాణ ప్రజలకంటే ఎక్కువగా ఇప్పుడు ఆంధ్రావారే కేసిఆర్ ను అభిమానించే రోజులు వస్తున్నాయి.