Asianet News TeluguAsianet News Telugu

ఈడీ వాళ్లు వస్తే నాకే చాయి తాగించి పోతారు.. కాంగ్రెస్‌కు ఓటేస్తే వృథానే: సీఎం కేసీఆర్

మునుగోడులో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభ వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల బాయిల కాడ కరెంట్ మీటర్లు పెట్టమంటే తాను పెట్టలేదని చెప్పారు. రైతులు, భూములను కూడా మోదీ సర్కార్ అమ్మేస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు.

KCR Fires on BJP At TRS Praja Deevena Sabha in Munugode
Author
First Published Aug 20, 2022, 5:17 PM IST

మునుగోడులో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభ వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల బాయిల కాడ కరెంట్ మీటర్లు పెట్టమంటే తాను పెట్టలేదని చెప్పారు. రైతులు, భూములను కూడా మోదీ సర్కార్ అమ్మేస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. మోదీ దోస్తులు సూట్‌కేసులు పట్టుకుని రెడీగా ఉన్నారని ఆరోపించారు. రైతులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదని.. మన బతుకు ఎన్నిక అని కేసీఆర్ చెప్పారు. ప్రజలు దీని గురించి గ్రామాల్లో చర్చించాలని కోరారు. 

రైతు బంధు, పెన్షన్లు ఎందుకు ఇస్తున్నారని కేంద్ర మంత్రులు తమను నిలదీశారని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు బంద్ పెట్టాలని అంటున్నారని తెలిపారు.గుజరాత్ ఇస్తున్నా రూ. 600 పింఛను ఇక్కడ ఇవ్వాలని అంటున్నారని చెప్పారు. కేంద్రం అన్నింటిపై జీఎస్టీ వసూలు చేస్తూ బ్యాంకులను ముంచే వాళ్లకు పంచుతుందని విమర్శించారు. దేశంలో విద్వేషం పుట్టిస్తే మంచిదా? అని ప్రశ్నించారు. మత విద్వేషాలు పెరిగితే నష్టపోయేది దేశ ప్రజలేనని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయిందని చెప్పారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిందన్నారు. దేశంలో నుంచి బీజేపీని తరిమికొట్టాలని పిలపునిచ్చారు. 

బీజేపీ వాళ్లకు ఎందుకింత అహంకారం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రాలలో విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలదోయాలని చూస్తుందని మండిపడ్డారు. ఏక్‌నాథ్ షిండేలను సృష్టిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ సర్కార్‌ను పడగొడతా అంటున్నారని తెలిపారు. మోదీని ఆయన అహంకారమే పడగోడుతుందని చెప్పారు. ఈడీకి దొంగలు, లంగలు భయపడతారని.. తామేందుకు భయపడతామని కేసీఆర్ అన్నారు. ఈడీ వస్తే తన దగ్గర ఏముందని.. వాళ్లే తనకు చాయి తాగించి పోవాలే అని అన్నారు. బీజేపీ గోకినా గోకకపోయినా.. నేను గోకుతా అని చెప్పానని అన్నారు. మునుగోడులో బీజేపీకి ఎప్పుడూ డిపాజిట్లు రాలేదని అన్నారు. 

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనని బీజేపీతో తాను పోరాడుతున్నానని చెప్పారు. బీజేపీ ఓటు వేస్తే.. రైతుల బాయిల కాడ మోటార్లకు మీటర్లు వచ్చినట్టేనని చెప్పారు. తెలంగాణ ప్రజల బలం చూసుకునే.. తాను మీటర్లు పెట్టనని కేంద్రంతో పోరాడుతున్నానని చెప్పారు. ప్రజలు ఓటు వేయడానికి ముందు బోర్‌కు, గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 

Also Read: కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై అమిత్ షా రేపటి సభలో సమాధానం చెప్పాలి.. సీఎం కేసీఆర్

మీటర్లు పెట్టమనే బీజేపీ కావాలా?, మీటర్లు వద్దనే టీఆర్ఎస్ కావాలా? అని ప్రశ్నించారు. మునుగోడులో బీజేపీని గెలిపిస్తే రేపు మోటార్లకు మీటర్లకు పెడతారని అన్నారు.  కాంగ్రెస్‌కు ఓటేస్తే వృథా అయిపోతుందన్నారు. మాయ మాటల విని మోసపోతే.. గోసపడతాం అని అన్నారు. మునుగోడు ప్రజలు దయచేసి ప్రలోభాలకు లొంగిపోవద్దని.. ఇది పార్టీల ఎన్నిక కాదని అన్నారు. ఢిల్లీలో కరెంట్ లేదని.. హైదరాబాద్‌లో ఉంటుందని చెప్పారు. గ్యాస్ సిలిండర్ మళ్లీ రూ. 400కు రావాలంటే బీజేపీని ఓడించాలన్నారు. బీజేపీని గెలిపిస్తే అన్ని సంక్షేమ పథకాలు పోతాయని అన్నారు. మునుగోడు ఫలితంలో దేశానికి ఒక సందేశం ఇవ్వాలని కోరారు. 

మళ్లీ కూడా తాను మునుగోడుకు వస్తానని చెప్పారు. చండూరులో మరో సభ పెట్టుకుందామని అన్నారు. వేరే వాళ్లను కూడా తీసుకోని వస్తానని తెలిపారు. కేసీఆర్ బతికున్నంత వరకు రైతు బంధు ఆగదని.. మీటరు పెట్టనని చెప్పారు.  కత్తి ఒకరికి ఇచ్చి.. యుద్దం మరోకరిని చేయమంటే కుదరదని అన్నారు. యుద్దం ఎవరు చేస్తారో వాళ్ల చేతిలోనే కత్తి పెట్టాలని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios