విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి విజయవాడ పర్యటన సందర్భంగా ఇంద్ర కీలాద్రిపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు సందడి చేశారు. గురువారం బెజవాడ దుర్గమ్మకు మొక్కులు సమర్పించేందుకు కేసిఆర్ కటుంబ సమేతంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఈ సమయంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు జై కేసీఆర్‌.. జై జై కేసీఆర్‌.. అంటూ నినాదాలు చేశారు. విజయవాడ నగరంలో కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతల బ్యానర్లు, పార్టీ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.కేసీఆర్‌ పర్యటనకు ఇంద్రకీలాద్రిపై భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.  మొక్కులు తీర్చుకున్న తర్వాత పూజారులతో సహా పలువురు కేసీఆర్ తో ఫొటోలు దిగడానికి ఉత్సుకత ప్రదర్శించారు. 

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇంచార్జ్ కలెక్టర్ విజయ కృష్ణ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, తెలంగాణ ప్రతినిధులు స్వాగతం చెప్పారు.