Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కుటుంబం తొలిసారిగా ఎన్నికలకు దూరం

టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉన్నది. 2004 మొదలు ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం పోటీ చేసింది. కానీ, 2024 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఆయన కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదు.
 

kcr family for the first time staying away from elections after trs party established kms
Author
First Published Mar 25, 2024, 6:59 PM IST

కేసీఆర్ మరికొంత మంది నాయకులతో కలిసి 23 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) ను స్థాపించారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం పోటీ చేస్తూనే వస్తున్నది. అది స్వయంగా కేసీఆర్ లేదా తనయుడు కేటీఆర్, తనయ కవిత, మేనల్లుడు హరీశ్ రావుల్లో ఎవరో ఒకరు కచ్చితంగా బరిలో ఉంటున్నారు. కానీ, ఈ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ తొలిసారి బరిలో ఉండటం లేదు. 2004 నుంచి ఇలా ఎన్నికల్లో దూరం ఉండటం ఇదే తొలిసారి.

ఈ లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ లేదా హరీశ్ రావు పోటీ చేయవచ్చని ప్రచారం బాగానే జరిగింది. కానీ, ఈ ఎమ్మెల్యేలు ఎవరూ బరిలోకి దిగలేదు. 2019లో నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా.. ఈ సారికైతే పోటీ చేయడం లేదు. ప్రస్తుతం ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయ్యారు.

కేసీఆర్ టీడీపికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమాన్ని పునరుజ్జీవనం చేయడానికి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. ఆ తర్వాత వచ్చిన 2004 ఎన్నికల్లో కరీంనగర్ నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. అప్పుడే కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2006, 2008 ఉప ఎన్నికల్లోనూ కేసీఆర్ పోటీ చేసి గెలిచారు.

2009 సార్వత్రిక ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి కేసీఆర్ లోక్ సభకు ఎన్నికయ్యారు. ఈ సమయంలోనే ప్రత్యేక తెలంగాణ కల నెరవేరింది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేసీఆర్ సీఎం అయ్యారు. కేటీఆర్, హరీశ్ రావులు క్యాబినెట్ మంత్రులు అయ్యారు. జమిలిగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవిత పోటీ చేసి నిజామాబాద్ ఎంపీగా గెలిచారు.

2018లోనూ టీఆర్ఎస్ అధికారాన్ని కాపాడుకుంది. కానీ, 2019లో కవిత లోక్ సభకు మరోసారి నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంటే.. 2018 అసెంబ్లీ, 2019 లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం పోటీ చేసింది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు పోటీ చేసి గెలిచారు. కానీ, 2024 లోక్ సభ ఎన్నికల బరిలో మాత్రం కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో లేరు. టీఆర్ఎస్ ఇప్పటికే అన్ని 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios