వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో తెలుగుదేశం నేతృత్వంలో ఏర్పడిన మహా కూటమిని ఎదుర్కుని విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో మాహా కూటమిని ఏర్పాటు చేసినప్పటికీ ఎన్టీ రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది.
హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఒంటరి పోరాటం ద్వారా వివిధ పార్టీలతో ఏర్పడిన మహాకూటమిని వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఎన్టీ రామారావుకు అదే పరిస్థితి ఎదురైంది.
వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో తెలుగుదేశం నేతృత్వంలో ఏర్పడిన మహా కూటమిని ఎదుర్కుని విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో మాహా కూటమిని ఏర్పాటు చేసినప్పటికీ ఎన్టీ రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది.
రెండు సందర్భాల్లోనూ కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఏర్పడిన కూటమిని ఓడించి అధికారంలోకి వచ్చింది. ఈ స్థితిలో వచ్చే తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
2009 ఎన్నికల్లో తెలుగుదేశం, టీఆర్ఎస్, వామపక్షాలు కూటమిగా ఏర్పడి కాంగ్రెసు పార్టీపై పోటీ చేశాయి. అప్పుడు వైఎస్ అధికారంలో ఉన్నారు. కాంగ్రెసు 294 సీట్లలో 156 సీట్లు గెలుచుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెసు 185 సీట్లతో ఘన విజయం సాధించింది. మెజారిటీ తగ్గడంపై వైఎస్ ప్రతిస్పందిస్తూ ... ప్రజలు తమకు పాస్ మార్కులు మాత్రమే వేశారని, డిస్టింక్షన్ ఇవ్వలేదని అన్నారు.
1989లో ఎన్టీఆర్ శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. లోకసభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆయన ఆ పనిచేశారు. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలోని కాంగ్రెసుకు వ్యతిరేకంగా తెలుగుదేశం, సిపిఎం, ,సిపిఐ, బిజెపి, జనతాదళ్, కాంగ్రెసు (ఎస్) కూటమిగా ఏర్పడ్డాయి.
తెలుగుదేశం పార్టీని చావు దెబ్బ తీస్తూ కాంగ్రెసు 181 సీట్లను గెలుచుకుంది. అంతకు నాలుగున్నరేళ్ల క్రితమే జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 294 సీట్లలో 249 సీట్లకు పోటీ చేసి 202 సీట్లు గెలుచుకుంది.
ఈసారి కేసిఆర్ శానససభను నిర్ణీత గడువుకున్నా 9 నెలల ముందు రద్దు చేశారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తోంది. కాంగ్రెసు నేతృత్వంలో మహా కూటమి ఏర్పడింది. మరోవైపు సిపిఎం బిఎల్ఎఫ్ అనే కూటమి కట్టి ఎన్నికల బరిలోకి దిగుతోంది. బిజెపి ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధపడింది. జనసేన, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలు పోటీ చేస్తాయా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
