తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు నేడు యాదాద్రిలో పర్యటిస్తున్నారు. యాద్రాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు.. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత‌రం కేసీఆర్ దంప‌తుల‌ను అర్చ‌క బృందం ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం రామలింగేశ్వర స్వామివారి ఆలయ ఉద్ఘాట‌న క్ర‌తువులో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. మ‌హా పూర్ణాహుతి, మహాకుంభాభిషేక మహోత్సవాల్లో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, జ‌గ‌దీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఉన్నారు.

తోగుట పీఠాధిప‌తి మాధ‌వానంద స‌ర‌స్వ‌తి స్వామివారి చేతుల మీదుగా రామలింగేశ్వర స్వామి వైభవంగా ఉద్ఘాట‌న క్ర‌తువును నిర్వ‌హించారు. ఇక, ఈ రోజు ఉదయం ధనిష్ఠానక్షత్ర సుముహూర్తాన తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి చేతుల మీదుగా సపరివార రామలింగేశ్వర స్పటికలింగ ప్రతిష్ఠ, అష్టబంధం, ప్రాణప్రతిష్ఠ, ప్రతిష్ఠాంగహోమం, అఘోర మంత్రహోమం, దీగ్దేవతాక్షేత్రపాల బలిహరణం, శోభాయాత్ర, కలశప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు.ఉద్ఘాటన పూర్తి కావడంతో.. నేటి నుంచి రామలింగేశ్వర స్వామి నిజదర్శనాన్ని భక్తులకు కల్పించనున్నారు.