రిజర్వేషన్ల పెంపుపై సీఎం కేసీఆర్
రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు, వాల్మికి బోయిలకు కచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని, ఈ విషయంలో కేంద్రం చొరవ చూపకపోతే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు అసెంబ్లీలో ఆయన రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడారు.
భూమి, ఆకాశం ఏకం చేసైనా గిరిజనులు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. వాల్మీకి బోయలు, కాయిత లంబాడీలను ఎస్టీల్లో చేర్చితే వారి జనాభా కూడా అటూ ఇటుగా 12 శాతం అవుతుందని వివరించారు. తమిళనాడు తరహాలో జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
సభలో చట్టం చేసి అవసరమైతే కేంద్రం దగ్గరికి అందరం వెళ్లి ఆమోదం కోసం పోరాటం చేద్దామని అన్నిపార్టీల సభ్యులను ఉద్దేశించి ప్రకటించారు. ఈ విషయంలో అవసరమైతే అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం పెడతానని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
