Asianet News TeluguAsianet News Telugu

అందుకే ముందస్తుకు వెళ్లాం: కేసీఆర్ స్పష్టత

తెలంగాణ ఆపద్ధర్మ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతోనే తాను ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్లు ఓ జాతీయ మీడియాకు కేసీఆర్ వివరించారు. 

kcr clarified on early elections in telangana
Author
Hyderabad, First Published Dec 4, 2018, 3:53 PM IST

హైదరాబాద్‌: తెలంగాణ ఆపద్ధర్మ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతోనే తాను ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్లు ఓ జాతీయ మీడియాకు కేసీఆర్ వివరించారు. 

తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అతివిశ్వాసంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లలేదన్నారు. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత దేశ రాజకీయాలపై దృష్టి పెడతానని చెప్పారు. దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ కూటమిలకు భిన్నంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఉంటుందన్నారు. 
ప్రత్యేక పంథాలో దేశంలోని ప్రజలందరినీ ఏకం చేయాలనుకుంటున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్‌, బీజేపీ వంకర పార్టీలంటూ కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఈ రెండు పార్టీలతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆర్‌ఎస్‌ఎస్‌, ఆర్‌ఎస్‌యూ, రాడికల్‌ స్టూడెంట్స్‌తో పాటు దేశంలోని 42 పార్టీల మద్దతు తీసుకున్నట్లు గుర్తు చేశారు. తెలంగాణ సాకారమైందని, ఇక జాతీయ రాజకీయాల్లోకి అడగుపెడతానని ప్రకటించారు.

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబుపైనా కేసీఆర్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయడు ఓ డర్టీ పొలిటీషియన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన కేసీఆర్ చిన్న మోదీ అంటూ తనపై ఆరోపణలు చేసిన చంద్రబాబును మురికి రాజకీయ నాయకుడు అంటూ మండిపడ్డారు. 

చంద్రబాబు నాయకుడు కాదని, మీడియా మేనేజర్‌ అని ఆరోపించారు. కొంత కాలం బీజేపీతో స్నేహం చేసి వదిలేశారని, గతంలో తిట్టిన కాంగ్రెస్‌తో ఇప్పుడు చేతులు కలిపారని ధ్వజమెత్తారు. పార్టీల మార్పుపై ప్రజలకు ఆయన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 
 
తెలంగాణలో ఉన్న 17 మంది ఎంపీలను గెలిపించుకుని జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని తెలిపారు. జయప్రకాశ్‌ నారాయణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు ఒక్కరే ఉన్నారని, మలిదశ తెలంగాణ ఉద్యమం తన ఒక్కడితోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. 

పశ్చిమబంగా సీఎం మమత బెనర్జీ, ఒడిస్సా సీఎం నవీన్‌ పట్నాయక్‌ లాంటి నాయకులు కాంగ్రెస్‌, బీజేపీ యేతర కూటమిలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ రాజకీయ కూటమి కాదని, ప్రజల కూటమని కేసీఆర్ పేర్కొన్నారు. 

ఫెడరల్‌ ప్రంట్‌ ప్రధాని అభ్యర్థి ఎవరనేది సరైన సమయంలో ప్రకటిస్తామన్నారు. చంద్రబాబును ఓడించడానికి ఏపీ రాజకీయాల్లోనూ కలగజేసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబుతో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు పెట్టుకోవడం తప్పుడు నిర్ణయమన్నారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబు నమ్మరని చెప్పారు. మహాకూటమిలో కోదండరాం చేరడం సరైన నిర్ణయం కాదన్నారు.

తమ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని తాము తిరిగి  తెలంగాణలో అధికారంలోకి వస్తామని కేసీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. తమ పార్టీకి 95 నుంచి 107 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేశామని ఆయన చెప్పుకొచ్చారు. తమ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేవని కేసీఆర్ తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios