హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఇక కేబినేట్ కూర్పుపై కసరత్తు ప్రారంభించారు. గతంలో తన మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ముహమూద్ అలీకి మాత్రమే కేసీఆర్ ఛాన్స్ ఇచ్చారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముహమూద్ అలీ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. 

అయితే కేసీఆర్ టీంలో పాతవాళ్లు ఉంటారా...ఉంటే ఎవరెవరు ఉంటారు...కొత్తవాళ్లకు అవకాశం ఉంటుందా....ఈ ఎన్నికల్లో ఓడిపోయిన వారి స్థానాల్లో కొత్తవారిని ప్రకటిస్తారా ఇవే చర్చలు జరుగుతున్నాయి. కేసీఆర్ తన కేబినెట్‌లోకి ఎవరెవరిని తీసుకోనున్నారనే దానిపై ఉత్కంఠ వీడటం లేదు. 

కేబినెట్‌లోకి మంత్రులను తీసుకునేందుకు మరికొంత సమయం పట్టనున్న నేపథ్యంలో ఆశావహులకు మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని శాసనసభ్యుల సంఖ్య ప్రకారం కేబినెట్‌లో సీఎం సహా మంత్రుల సంఖ్య 18కి మించకూడదు. 

అంటే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో 17 మందికి మంత్రులయ్యే అవకాశం ఉంది. అందులో మాజీ డిప్యూటీ సీఎం ముహమూద్ అలీని అదృష్టం వరించగా మిగిలినవారిలో ఆ అదృష్ణం ఎవరిని వరిస్తుందనే చర్చ టీఆర్‌ఎస్‌ పార్టీలో విస్తృతంగా జరుగుతోంది. 

శాసన మండలిలో టీఆర్‌ఎస్ కు పూర్తి మెజారిటీ ఉండడం, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున 88 మంది, స్వతంత్రులను కలుపుకుని 90 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో మంత్రి పదవుల కోసం పోటీ పడే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. 

ఈ నేపథ్యంలో జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా కేబినెట్‌ కూర్పు చెయ్యాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్, ముహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చెయ్యడం చూస్తుంటే కేబినేట్ కూర్పు కేసీఆర్‌కు కత్తి మీద సాముగా మారిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఇకపోతే కేసీఆర్ మెుదటి సారి కేబినేట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి మంత్రి పదవులపై పలువురికి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ హామీని కేసీఆర్ నిలబెట్టుకుంటే తనకు మంత్రి పదవి గ్యారంటీ అంటూ పలువురు కళ్ళల్లో ఒత్తిలేసుకుని సార్ పిలుపుకోసం వేచిచూస్తున్నారు. 

జిల్లాల వారీగా పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలా జిల్లాల కేటీఆర్‌, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జోగు రామన్న, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, జి.జగదీశ్‌రెడ్డి, గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, పట్నం నరేందర్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 

అలాగే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మల్లారెడ్డి, బాల్క సుమన్‌, సీహెచ్‌ లక్ష్మారెడ్డి, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌, మర్రి జనార్దన్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, దానం నాగేందర్‌, పద్మారావు, పద్మాదేవేందర్‌ రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్‌ లాంటి వారి పేర్లను పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే వీరిలో తొమ్మిది మంది గత కేసీఆర్ కేబినేట్లో పనిచేసిన వారు కాగా కొంతమంది ప్రభుత్వ విప్, చీఫ్ విప్ లుగా పనిచేసిన వారు కూడా ఉన్నారు. మిగిలిన వారంతా కొత్తవారే.  వీరిలో ఎవరికి అవకాశం కల్పిస్తారో అన్నది సస్పెన్షన్. ఎమ్మెల్సీల నుంచి కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
 
అటు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ముత్యంరెడ్డికి రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ పదవి నిర్వహిస్తున్న గుత్తా సుఖేందర్‌రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. 

మరోవైపు మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మండలి చైర్మన్‌ పదవి కట్టబెడ్తారని తెలుస్తోంది. ప్రస్తుత మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ను వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి బరిలో దించాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇకపోతే  శాసనసభ స్పీకర్‌ పదవికి రెడ్యా నాయక్‌, ఈటల రాజేందర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.  
  
మెుత్తంగా ఈసారి కేబినేట్ కూర్పు వ్యవహారంలో కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఆ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడకుండా కేబినేట్ కూర్పును చేపడుతున్నట్లు సమాచారం.  
 

ఈ వార్తలు కూడా చదవండి

రెండోసారి సిఎంగా కేసీఆర్: క్యాబినెట్ లో కొత్త ముఖాలు