Asianet News TeluguAsianet News Telugu

రెండోసారి సిఎంగా కేసీఆర్: క్యాబినెట్ లో కొత్త ముఖాలు

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భారీ స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యనుంది. రెండు రోజుల్లో సీఎంగా గులాబీ దళపతి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. అయితే ఈసారి కేబినెట్ లో ఎవరెవరికి బెర్త్ లు దక్కుతాయా అన్నది దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

KCR may induct new faces into his cabinet
Author
Hyderabad, First Published Dec 11, 2018, 6:46 PM IST

హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భారీ స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యనుంది. రెండు రోజుల్లో సీఎంగా గులాబీ దళపతి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. అయితే ఈసారి కేబినెట్ లో ఎవరెవరికి బెర్త్ లు దక్కుతాయా అన్నది దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
అయితే ఈసారి కేసీఆర్ కేబినెట్ లో కొత్తవారికి అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో ఏర్పడ్డ కేసీఆర్ కేబినేట్ లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ విమర్శల మూటకట్టుకుంది. 

ఈ నేపథ్యంలో ఈసారి ఏర్పాటు చెయ్యబోయే కేబినేట్ లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే యోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన పద్మాదేవెందర్ రెడ్డిని కేబినెట్ లో తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. 

అలాగే ఆలేరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతలకు కేబినెట్ లో బెర్త్ దొరికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే విద్యార్థినేత స్థాయి నుంచి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే పెద్దపల్లి ఎంపీ, ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కు సైతం కేబినెట్ లో లేదా కీలక పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు నియోజకవర్గంలో ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ గొంగిడి సునీతపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. గొంగిడి సునీత తన కుమార్తె అని ఆమె ఆమె తాను ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి వెన్నంటి నిలిచిందని తెలిపారు. 

గొంగిడి సునీత గెలిస్తే ఆమె ఎమ్మెల్యేగా ఉండదని ఇంకా పెద్ద స్థాయిలో ఉంటుందని కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే సునీత కేసీఆర్ బిడ్డగా ఒక పెద్ద హోదాలో నియోజకవర్గంలో అడుగుపెడుతుందని అది జరగాలంటే భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అయితే ఈ ఎన్నికల్లో గొంగిడి సునీత సుమారు 34 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందరు. సునీత గెలుపుతోపాటు టీఆర్ఎస్ భారీ విజయం సాధించడంతో సునీతకు కేసీఆర్ కేబినెట్ లో బెర్త్ కన్ఫమ్ అయ్యేఅవకాశం ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. 

ఇకపోతే చెన్నూరు టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కు సైతం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్ తో విద్యార్థి నేతగా ఉన్నప్పటి నుంచి బాల్క సుమన్ కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా కేసీఆర్ బాల్క సుమన్ కు అవకాశం కల్పించారు. 

ఎంపీగా ఉంటుండగానే బాల్క సుమన్ ను అసెంబ్లీకి తీసుకువచ్చారు కేసీఆర్. సిట్టింగ్ ఎమ్మెల్యే ఓదేలును కాదని చెన్నూరు నియోజకవర్గం నుంచి బాల్క సుమన్ ను బరిలోకి దింపారు. బాల్క సుమన్ కు తొలుత ప్రతికూల పరిస్థితి ఏర్పడినా ఆ తర్వాత కేసీఆర్ సెట్ చేశారు. 

మరోవైపు చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సుమన్ ను గెలిపిస్తే ఒక పెద్ద హోదాలో మీ నియోజకవర్గానికి వస్తాడంటూ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిస్తే ఎమ్మెల్యేగానే ఉండిపోరని పెద్ద హోదా ఉంటుందని చెప్పుకొచ్చారు. 

అంతే కాదు బాల్క సుమన్ తన బిడ్డ అంటూ కేసీఆర్ ప్రకటించారు. తన బిడ్డలా తన ఇంట్లోనే పెరిగాడని అలాంటి వ్యక్తిని కేవలం ఎమ్మెల్యేతోనే వదిలేస్తానా అంటూ ప్రజలను అడిగారు. ఈ నేపథ్యంలో కేబినెట్లో బాల్క సుమన్ బెర్త్ కన్ఫమ్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. 

ఇకపోతే ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్ కు కూడా కేసీఆర్ కేబినెట్లో అవకాశం దొరికే ఛాన్స్ ఉంది. 2013లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆమె తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించారు. 2014లో ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రితేష్ రాథోడ్ పై 30వేల మెజారితో విజయం సాధించారు. 

ఈసారి ఖానాపూర్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ రాథోడ్ పై భారీ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో తనయుడిపై ఆమె విజయం సాధిస్తే నేడు తండ్రిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. 

ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రేఖా నాయక్ గిరిజన కోటాలో అవకాశం దొరికే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ ఓటమి పాలైన నేపథ్యంలో రేఖా నాయక్ కు ఆ అవకాశం దొరికే ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ కేబినెట్లో ఆమెకు అవకాశంపై చర్చ

Follow Us:
Download App:
  • android
  • ios