హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో మాజీ శానససభ్యుడు పద్మారావు మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. హైదరాబాదు నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, రంగారెడ్డి నుంచి మేడ్చెల్ శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డికి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పిం్చారు. 

హైదరాబాదు జిల్లా నుంచి గత కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన నాయిని నర్సింహారెడ్డి, సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే టి.పద్మారావులకు ఈసారి చోటు దక్కలేదు. పద్మారావుకు కేబినెట్‌ హోదా కలిగిన డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర కేబినెట్‌లో చోటు దక్కలేదని తెలిసి సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే టి.పద్మారావు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న తనకు కాకుండా టీడీపీ అభ్యర్థిగా తనతో పలుమార్లు తలపడిన శ్రీనివాసయాదవ్‌కు స్థానం కల్పించటంపై పద్మారావు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 


తలసానికి మంత్రి పదవి ఇవ్వటంపై తనకు అభ్యంతరం లేదని, అదే సమయంలో తనకు కూడా ఇస్తే సరైన గౌరవం ఉంటుందని పద్మారావు పార్టీ ముఖ్యనేతల వద్ద అన్నట్లు తెలుస్తోంది..