హైదరాబాద్: టీఆర్ఎస్‌లో హరీష్‌రావుకు మళ్లీ ప్రాధాన్యత పెరిగిందని ఆయన  సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. దసరా తర్వాత కేబినెట్ విస్తరణలో కూడ హరీష్‌కు చోటు దక్కే అవకాశం ఉందని కూడ  ఆయన సన్నిహితులు నమ్మకంగా ఉన్నారు.  

రెండు రోజుల క్రితం పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో టీఆర్ఎస్ చీఫ్  కేసీఆర్ పార్టీ కార్యాలయంలో  సమావేశంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు విషయమై చర్చించారు. సభ్యత్వ నమోదుపై కేసీఆర్ ప్రజా ప్రతినిధులకు పలు సూచనలు ఇచ్చారు.

పార్టీ సభ్యత్వాన్ని తీసుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు.  కేసీఆర్ తర్వాత  ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కె. కేశవరావు సభ్యత్వం తీసుకొన్నారు.  ఈ సమయంలోనే కేసీఆర్  కీలకమైన ప్రకటన చేశారు.

మాజీ మంత్రి హరీష్‌రావును పిలిచి మరీ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని  కోరారు. పార్టీ ఆవిర్భావం నుండి  తనతో పాటు హరీష్ రావు టీఆర్ఎస్‌ బలోపేతం చేసేందుకు ప్రయత్నించారని కేసీఆర్ ప్రశంసలు కురిపించారు.  

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతల ఓటమిలో  హరీష్ రావు కీలకంగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  హరీష్ రావు కేవలం మెదక్ పార్లమెంట్ స్థానానికే పరిమితమైంది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత  చోటు చేసుకొన్న పరిణామాలు హరీష్‌ను పక్కన పెట్టారనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని  హరీష్ రావు ఖండించారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత హరీష్‌రావు కేసీఆర్ తో భేటీ అయ్యారు.

రెండు రోజుల క్రితం కొత్త సచివాలయ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో  హరీష్ రావు, కేటీఆర్‌లు పాల్గొన్నారు. ఆ సమయంలో  కూడ వీరిద్దరి మధ్య సరదా సంభాషణ చోటు చేసుకొంది.సచివాలయం కూల్చివేస్తే గతంలో  తాము మంత్రులుగా  పనిచేసిన సమయంలో  ఉపయోగించిన చాంబర్లు కన్పించవని  కేటీఆర్  అన్నారు. అవునంటూ హరీష్ సమాధానం ఇచ్చారు.

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమమంలో హరీష్ రావును ప్రశంసిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన సన్నిహితుల్లో సంతోషాన్ని నింపాయి.  హరీష్‌రావును పార్టీ దూరం పెట్టడం లేదు.. అదంతా ప్రచారమేననే సంకేతాలు ఇచ్చే దిశగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు  భావిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా