తెలంగాణ ఉద్యమం అలా ప్రారంభమైంది: బాన్సువాడలో కేసీఆర్
బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ లో వెంకటేశ్వర ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కామారెడ్డి: సమైక్య రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడ్డామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే ఈ బాధలు తొలుగుతాయని భావించినట్టుగా ఆయన తెలిపారు. అందుకే తెలంగాణ ఉద్యమం ప్రారంభించినట్టుగా కేసీఆర్ వివరించారు.
కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ బుధవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో ఈ ఆలయం ఉంది. అనంతరం గ్రామంలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వెంకటేశ్వరస్వామని ప్రార్ధించినట్టుగా కేసీఆర్ చెప్పారు.
గతంలో తాను ఈ గుడికి వచ్చిన సమయంలో గుడి సాధారణంగా ఉండేదన్నారు. కానీ ఇవాళ గుడి చుట్టూ పచ్చని పొలాలు , చెరువుతో ఆహ్లాదకరంగా ఉందని కేసీఆర్ చెప్పారు. తిమ్మాపూర్ ఆలయ అభివృద్దికి రూ. 7 కోట్లు మంజూరు చేస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు.
సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని కేసీఆర్ గుర్తు చేశారు.అందుకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.
also read:కామారెడ్డి టూర్.. తిమ్మపూర్ శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు..
సింగూరు ప్రాజెక్టును హైద్రాబాద్ కు మంచినీళ్ల కోసం ఉపయోగించేలా ఉమ్మడి ఏపీ రాష్ట్ర పాలకులు తీసుకున్నారని చెప్పారు. ఘనపూర్ ఆయకట్టుకు నీళ్లివ్వలేదన్నారు. ఈ విషయమై ఆనాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి అనేక పోరాటాలు నిర్వహించారని కేసీఆర్ గుర్తు చేశారు. సాగునీటి కోసం ఈ ప్రాంత రైతులు ఇబ్బందులు పడ్డారని ఆయన చెప్పారు.
తన నియోజకవర్గ అవసరం కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక చిన్నపిల్లాడిలా కొట్లాడుతాడని కేసీఆర్ చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గానికి రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. ఈ నిధులను శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో అవసరం ఉన్న చోట ఖర్చు చేయాలని కేసీఆర్ సూచించారు. తన నియోజకవర్గంలో చేసిన అభివృద్దిని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనకు వివరించారన్నారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి తనకు ఆత్మీయుడిగా కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేసిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.