త్వరలో జరగనున్న హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్ధిగా సురభి వాణీదేవి పేరును ఖరారు చేశారు ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.

సురభి వాణీదేవి దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె. ఈ మేరకు వాణీదేవి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ స్థానం అభ్యర్థి ఎంపికపై గతకొంత కాలంగా ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే. జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు అవకాశం ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా కేసీఆర్‌ అభ్యర్థిని ప్రకటించారు. 

ఇప్పటికే వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించారు కేసీఆర్. దీనికి సంబంధించి బుధవారం ప్రగతి భవన్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌ బీ ఫాం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి..  ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి తనకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

వరంగల్- నల్గొండ- ఖమ్మం, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి- హైదరాబాద్‌ జిల్లాల పట్టాభద్రుల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి,  ఎన్‌ రామచంద్రరావు పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది.

దీంతో ఇటీవల కేంద్రం ఆయా స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 23 వరకు అభ్యర్థులు నామినేషన్లు వేయొచ్చు.