Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయంపై కేసీఆర్, కేటీఆర్ ధీమా.. 15 వేల మెజారిటీ వస్తుందని లెక్కలు..!

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ముగిసిన సంగతి తెలిసిందే. ఆదివారం (నవంబర్ 6) రోజున మునుగోడు విజేత ఎవరో తేలిపోనుంది. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 15వేల మెజారిటీతో విజయం సాధిస్తారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ధీమాగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

KCR And KTR Confident on TRS Win Munugode Bypoll With 15000 Majority
Author
First Published Nov 5, 2022, 11:18 AM IST

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ముగిసిన సంగతి తెలిసిందే. ఆదివారం (నవంబర్ 6) రోజున మునుగోడు విజేత ఎవరో తేలిపోనుంది. అయితే మునుగోడులో పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన చాలా ఎగ్జిట్ పోల్స్.. అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. మరోవైపు స్థానిక టీఆర్ఎస్ నేతలు కూడా ఇదే రకమైన నివేదికలను పార్టీ అధిష్టానానికి పంపినట్టుగా తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం ఫుల్ జోష్‌లో ఉంది. అయితే మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 15వేల మెజారిటీతో విజయం సాధిస్తారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ అంచనా వేసినట్టుగా ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి. 

అయితే మునుగోడుకు సంబంధించి వెలువడిన చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 5 గంటల వరకు సాగిన పోలింగ్‌ను పరిగణలోకి తీసుకన్నాయి. అయితే 5 గంటల తర్వాత మునుగోడులో భారీగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం వేళ ఓటర్లు భారీగా పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటలలోపు క్యూలైన్లలో వారందరీకి అధికారులు ఓటు వేయడానికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే కొన్ని పోలింగ్ బూత్‌లో ఓటింగ్ ప్రక్రియ ముగిసేసరికి రాత్రి 9 గంటలు కూడా అయింది. 

అయితే పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత నాయకుల నుంచి తెప్పించిన అన్ని రిపోర్ట్‌లను విశ్లేషించిన కేసీఆర్, కేటీఆర్.. టీఆర్ఎస్ 15 వేల మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసినట్టుగా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే సాయంత్రం 5 గంటల తర్వాత పెద్ద సంఖ్యలో యువత పోలింగ్ బూత్‌ల వద్దకు రావడంతో ఎగ్జిట్ పోల్స్‌పై తలెత్తిన సందేహాలను విశ్లేషించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీ అనుకూలంగా ఓట్లు పడినట్టుగా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ఓటర్ల సంఖ్య తక్కువగా ఉందని.. ఇది టీఆర్‌ఎస్‌ అవకాశాలపై ప్రభావం చూపదని ఆ పార్టీ అధిష్టానం అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందుకు ఉదహరణగా.. నియోజవర్గంలో మొత్తం  93 శాతం ఓటింగ్ నమోదుకాగా.. చండూరు మున్సిపాలిటీలో 68.22 శాతం, చౌటుప్పల్ మున్సిపాలిటీలో 73.80 శాతం నమోదైందని వారు చెబుతున్నట్టుగా సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఓటు వేశారని ధీమాతో కేసీఆర్, కేటీఆర్‌లు ఉన్నారు. 

ఇదిలా ఉంటే.. పోలింగ్ ట్రెండ్‌ను విశ్లేషించిన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు.. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 20 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా కష్టపడిన పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో కీలకపాత్ర పోషించిన పార్టీ సోషల్ మీడియా వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..  ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అనంతరం బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి.. ఆ పార్టీ అభ్యర్థిగా మునుగోడు ఉపఎన్నికలో బరిలో నిలిచారు. మరోవైపు టీఆర్ఎస్‌ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి బరిలో దిగారు. మొత్తంగా 47 మంది అభ్యర్థులు మునుగోడు బరిలో నిలిచారు. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగగా.. రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,41,805 మంది ఓటర్లలో 2,25,192 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసీ అదికారులు తెలిపారు. ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో 91.31 శాతం పోలింగ్ నమోదైంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios