హింసకు పాల్పడేవారికి ఓటుతో బుద్ది చెప్పాలి: నారాయణఖేడ్ సభలో కేసీఆర్
చేతకాని కాంగ్రెస్ దద్దమ్మలు హింసకు తెగబడుతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. నారాయణఖేడ్ లో భూపాల్ రెడ్డిని గెలిపిస్తే అన్ని సమస్యలను పరిష్కరించనున్నట్టుగా కేసీఆర్ హామీ ఇచ్చారు.
నారాయణఖేడ్: ఓటు ద్వారా హింస రాజకీయాలకు పాల్పడేవారికి బుద్ది చెప్పాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. ప్రజల మద్దతుతో గెలవడం చేతకాని కాంగ్రెస్ దద్దమ్మలు దాడులకు పాల్పడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు.
సోమవారంనాడు నారాయణఖేడ్ లో నిర్వహించిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. దుబ్బాకలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశారని కేసీఆర్ చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఈ సభకు రాకుండా మంత్రి హరీష్ రావు ప్రభాకర్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించినట్టుగా కేసీఆర్ వివరించారు.
ప్రభాకర్ రెడ్డికి ప్రాణాపాయం తప్పిందన్నారు. తాను వెంటనే అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాను జుక్కల్ లో ఉన్న సమయంలోనే ఈ విషయం తనకు సమాచారం వచ్చిందన్నారు. దీంతో అక్కడి నుండే తిరిగి రావాలనుకున్నానని కేసీఆర్ చెప్పారు. ప్రభాకర్ రెడ్డికి ప్రాణాపాయం లేదని సమాచారం వచ్చినందున బాన్సువాడ, నారాయణఖేడ్ సభలకు హాజరైనట్టుగా కేసీఆర్ చెప్పారు.
also read:రాజకీయంగా ఎదుర్కోవాలి,దాడులు సరికాదు : కొత్త ప్రభాకర్ రెడ్డి దాడిపై హరీష్ రావు
ప్రజలకు ఎప్పుడు అవసరం వచ్చిన భూపాల్ రెడ్డి అందుబాటులో ఉంటారన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టకు సింగూర్ ను లింక్ చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.నారాయణఖేడ్ నియోజకవర్గంలో 1.80 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామన్నారు.నారాయణఖేడ్ ఎమ్మెల్యే ప్రజల కోసం ఎప్పుడూ పరితపించేవాడన్నారు. నియోజకవర్గంలో గిరిజన తండాలు అభివృద్ది చేస్తామన్నారు. భూపాల్ రెడ్డిని మరోసారి గెలిపిస్తే నల్లవాగు మంజూరు చేసే బాధ్యత తనదన్నారు.