హైదరాబాద్: నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ పదవిని కట్టబెట్టనున్నారనే విషయమై ప్రస్తుతం ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. మంత్రివర్గ విస్తరణ పూర్తైంది. నామినేటేడ్ పదవులను కూడ త్వరలోనే భర్తీ చేయనున్నారు.ఈ సమయంలోనే కవితకు కూడ కీలక పదవిని కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. 

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి కవిత పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. 

ధర్మపురి అరవింద్ విజయం వెనుక ఎంపీ డి.శ్రీనివాస్ కీలకంగా వ్యవహారించినట్టుగా నిజామాబాద్ రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉంది. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి కవిత విజయం సాధించారు. ఈ సమయంలో ఆమె జాతీయ రాజకీయాల్లో కూడ కీలకంగా వ్యవహరించారు.

పార్లమెంట్‌లో టీఆర్ఎస్ వాణిని విన్పించారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆమె పార్టీ కార్యక్రమాలకు కూడ దూరంగా ఉంటున్నారు. కవితకు కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం కూడ సాగింది. 

అయితే మంత్రివర్గంలోకి కవితను తీసుకోలేదు. సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డికి  కేసీఆర్ అవకాశం కల్పించారు. దీంతో కవితకు ఏ పదవి ఇస్తారనే విషయమై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

కవితను రాజ్యసభకు పంపే అవకాశం ఉందనే చర్చ కూడ సాగుతోంది. ఎంపీగా ఉన్న సమయంలో జాతీయ రాజకీయాల్లో ఆమె కీలకంగా వ్యవహరించారు. రాజ్యసభకు పంపితే మరోసారి పార్టీ వాణిని విన్పించే అవకాశం ఉందని అంటున్నారు.

మరో వైపు కేటీఆర్ ను మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడ ఆయనే చూస్తున్నారు. అయితే విధి నిర్వహణలో ఒత్తిడి కారణంగా కేటీఆర్ కు బదులుగా కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందనే చర్చ కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

కవితకు మాత్రం త్వరలోనే కీలకమైన పదవిని కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం మాత్రం టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది. అయితే ఆ పదవి ఏమిటనేది త్వరలోనే తేలనుందని గులాబీ వర్గాలు అంటున్నాయి.

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎప్పుడు ఏం చేస్తారో అనే విషయం ముందుగా ప్రకటించరు. ఆయన నిర్ణయాలన్నీ సస్పెన్స్ గా ఉంటాయి. నిర్ణయాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు కేసీఆర్. 

అయితే కవిత విషయంలో కేసీఆర్ మనసులో ఏముందనే విషయమై ఇంకా బయట పెట్టలేదు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకొంటారనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతున్న ప్రచారానికి అనుగుణంగా కేసీఆర్ కవితకు కీలక పదవిని కట్టబెడుతారా లేదా అనేది కాలమే తేల్చనుంది.