హైదరాబాద్:  తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు కేరళ సీఎం పినరయి విజయన్‌తో తిరువనంతపురంలో భేటీ కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్  ఏర్పాటు విషయమై  కేసీఆర్ విజయన్‌తో చర్చించనున్నారు.

అదే సమయంలో  రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను కేసీఆర్ సందర్శించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీపీఎం రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో కూడ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను విజయన్‌ మర్యాద పూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే.

ఈ నెల 13వ తేదీన తమిళనాడులో కేసీఆర్‌ పర్యటించనున్నారు. చెన్నైలో డీఎంకె అధ్యక్షుడు స్టాలిన్‌తో  కేసీఆర్ భేటీ కానున్నారు. దేశ రాజకీయ పరిస్థితులపై స్టాలిన్‌తో కేసీఆర్ చర్చించనున్నారు. 

సోమవారం ఉదయం కేసీఆర్‌తో కర్ణాటక సీఎం కుమారస్వామి ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. కేరళ, తమిళనాడు రాష్ట్రాల పర్యటనల తర్వాత కేసీఆర్ కర్ణాటక రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త  రాజకీయ కూటమి ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.