కరీంనగర్ పోలీసులు డెకాయిట్లలా వ్యవహరించారని, కార్యకర్తలను, మహిళలను కూడా చూడకుండా లాఠీ ఛార్జ్ చేసి గాయపర్చారని చత్తీస్ ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ ఆరోపించారు. గురువారం ఆయన బండిసంజయ్, ఇతర బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు విషయంలో కరీంనగర్ పోలీసులు డెకాయిట్లలా పనిచేశారని, కార్యకర్తలను, మహిళలను కూడా చూడకుండా లాఠీ ఛార్జ్ చేసి గాయపర్చారని చత్తీస్ ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ ఆరోపించారు. గురువారం ఆయన బండిసంజయ్, ఇతర బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరీంగనర్‌లో వేలాది మంది కార్యకర్తలు బండి సంజయ్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరీంనగర్ కమిషనర్, ఈ అరెస్టులో పాల్గొన్న ఇతర పోలీసులను సస్పెండ్ చేయాలన్నారు. అలాగే వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ పతనం మొదలైంది..
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం మొదలైందని చత్తీస్‌ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ హవా కొనసాగుతోందని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలు లాఠీల దెబ్బలకు, బుల్లెట్ల గాయాలకు భయపడేవారు కారని అన్నారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు చూపుతున్న పోరాటానికి, తెగువకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. తమది క్రమశిక్షణ కలిగిన, చిత్తశుధ్ధితో పనిచేసే పార్టీని అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నిజాం నియంతృత్వ, రజాకార్ల పాలన కొనసాగుతుందని విమర్శించారు.
తెలంగాణ బీజేపీ పోరాటం అభినందనీయం..
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో సవరించాలని పోరాటం చేస్తున్న బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ నాయకుల పోరాటం అభినందనీయమని మాజీ సీఎం రమణ్ సింగ్ అన్నారు. తాను గతంలో ఒక సారి ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా తెలంగాణకు వచ్చానని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను గమనించానని చెప్పారు. కేసీఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాలనకు ప్రజల్లో వ్యతిరేకత ఉందని గమనించానని అన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
500 కోట్లు ఖర్చు పెట్టినా హుజూరాబాద్ లో ఓటమి..
తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గ ఎన్నికల్లో టీఆర్ఎస్ రూ.500 ఖర్చు పెట్టిందని, అయినా ఆ పార్టీ అక్కడ గెలవలేకపోయిందని తెలిపారు. ఈ ఓటమి వల్లనే టీఆర్ఎస్ పార్టీలో అసహనం పెరిగిపోయిందని చెప్పారు. అందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పోలీసులకు కరీంనగర్ ఎంపీ ఆఫీసులోకి చొరబడి, దానిని ధ్వంసం చేసే అధికారం లేదని అన్నారు. తెలంగాణలో నిజాం నియంతృత్వ పాలన సాగుతోందని, పోలీసులను ఇలాంటి పనులకు వాడుకోవడం చాలా బాధకరమని చెప్పారు. బండి సంజయ్ అరెస్టు సమయంలో మహిళలు అని చూడకుండా, వారిపై పోలీసులు దాడి చేయడం హేయనీయమని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి అధికారంలో ఉండే అర్హత లేదని అన్నారు.
జీవో సవరణలు చేసేంత వరకు పోరాటం- రఘునందన్ రావు
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోలో సవరణలు చేసేంత వరకు బీజేపీ పోరాటం చేస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈ విషయంలో ఎంత మందిని జైళ్లో పెట్టినా కూడా న్యాయస్థానాల ద్వారా, నిరసనలు చేపట్టడం ద్వారా పోరాటం చేస్తామని చెప్పారు. జీవోలో సవరణలు చేయాలని ఇప్పటికే గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే అందులోనూ ఇదే విషయం కోసం ప్రస్తావన తెస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ సవరణ కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు.
