Asianet News TeluguAsianet News Telugu

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ : హెచ్ఆర్సీని ఆశ్రయించిన రైతులు.. కలెక్టర్, పోలీసులపై ఫిర్యాదు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు ఆందోళన తీవ్రతరం చేశారు. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన రైతులు.. తాజాగా హెచ్ఆర్సీ మెట్టెక్కారు. మాస్టర్ ప్లాన్‌లో తమ భూములను లాక్కోవడం తీవ్ర అన్యాయమేనని రైతులు తెలిపారు. 

kamareddy master plan farmers moved to hrc
Author
First Published Jan 13, 2023, 5:15 PM IST

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు మానవ హక్కుల కమీషన్ (హెచ్ఆర్సీ)ని ఆశ్రయించారు. రైతులపై విచక్షణారహితంగా దాడులు చేశారని హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. కలెక్టర్, పోలీసులపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని కోరారు. మాస్టర్ ప్లాన్‌లో తమ భూములను లాక్కోవడం తీవ్ర అన్యాయమేనని రైతులు తెలిపారు. 

ఇదిలావుండగా.. కామారెడ్డి  కొత్త మాస్టర్ ప్లాన్ పై  లింగాపూర్ లో  రైతు జేఏసీ  నేతలు గురువారంనాడు  సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ నెల  20వ తేదీలోపుగా కౌన్సిలర్లు రాజీనామాలు  సమర్పించకపోతే  కౌన్సిలర్ల ఇళ్లను ముట్టడిస్తామని  రైతు జేఏసీ హెచ్చరించింది. ఈ నెల  15న మాస్టర్ ప్లాన్ పేరుతో ముగ్గులు వేసి నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇకపోతే.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  ఈ నెల  5వ తేదీన  కలెక్టరేట్ ఎదుట  రైతు జేఏసీ ఆధ్వర్యంలో  ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. అంతకుముందు  రోజే అడ్లూరు ఎల్లారెడ్డికి  చెందిన రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి  చెందిన ఉపసర్పంచ్ సహా  తొమ్మిది మంది వార్డు సభ్యులు  రాజీనామాలు చేశారు. ఈ నెల  6వ తేదీన కామారెడ్డి బంద్ కూడా నిర్వహించారు. 

ALso REad: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రైతుల పిటిషన్‌పై విచారణ.. స్టే ఇచ్చేందుకు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ..

అయితే మాస్టర్ ప్లాన్  ముసాయిదా మాత్రమేనని  జిల్లా కలెక్టర్  ప్రకటించారు. దీంతో  ఆందోళనలు  వారం రోజులపాటు  వాయిదా వేశారు. ఇవాళ మరోసారి  సమావేశమైన రైతు జేఏసీ ప్రతినిధులు  విలీన గ్రామాల  కౌన్సిలర్లను రాజీనామా చేయాలని డిమాండ్ ను తెరమీదికి తీసుకువచ్చారు. విలీన గ్రామాల నుండి తొమ్మిది మంది కౌన్సిలర్లు  ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ కౌన్సిలర్లు తమ పదవులకు  రాజీనామాలు సమర్పిస్తారా లేదా అనేది త్వరలో తేలనుంది. అటు కామారెడ్డి మాస్టర్ ప్లాన్  ను నిరసిస్తూ  రైతు జేఏసీ ప్రతినిధులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తమను సంప్రదించకుండా రీక్రియేషన్‌ జోన్‌గా ప్రకటించారని రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ తమకు నష్టం చేకూర్చే విధంగా ఉందని అన్నారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వ స్పందన కోరుతూ నేటికి వాయిదా వేసింది. 

అయితే మాస్టర్‌ ప్లాన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కామారెడ్డి టౌన్‌ప్లానింగ్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏమీకాదని హైకోర్టు పేర్కొంది. హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ విషయంలో ఏళ్ల తరబడి ఊగిసలాట కొనసాగుతుందని వ్యాఖ్యానించింది. అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేదని అని అభిప్రాయపడింది. మరోవైపు కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై అభ్యంతరాలు తీసుకుంటామని ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఇక, ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 25కు వాయదా వేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios