నిజామాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అఖండ మెజార్టీతో విజయం సాధించనున్నారని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

నిజామాబాద్ ,కామారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 824 మంది ఓటర్లుగా ప్రజాప్రతినిధులు ఉన్నారని, ఇందులో టీఆర్‌ఎస్ సంఖ్యా బలం 504 ఉండగా... ఎంఐఎంకు చెందిన  28 మంది ఓటర్లు టీఆర్‌ఎస్‌కే మద్దతు పలుకుతారని అన్నారు. అలాగే 66 మంది స్వతంత్ర ఓటర్లు కూడా కవిత గెలుపు కోసం టీఆర్‌ఎస్‌కే ఓటు వేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని ఇది వరకే ప్రకటించారని ఆయన తెలిపారు. దీంతో టీఆర్‌ఎస్ సంఖ్యా బలం 598కి చేరిందని మంత్రి పేర్కొన్నారు.

read more  కరోనా ఎఫెక్ట్... వారిని సురక్షితంగా కాపాడండి: ప్రధాని మోదీకి కేటీఆర్ ట్వీట్

141 సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్ 598 మంది ప్రజాప్రతినిధుల బలం ఉన్న టీఆరెస్ తో పోటీ ఎలా ఇస్తుంది? 85 మంది ఓటర్ల బలమున్న బీజీపీ 598 సంఖ్యాబలం ఉన్న టీఆరెస్ తో పోటీ చేసి నిలిచి గెలుస్తుందా?అని మంత్రి ప్రతి పక్షాలను ప్రశ్నించారు. 

ఇది వరకే ఒకసారి జరిగిన ఏమరుపాటుతో అభివృద్ధి మీద తీవ్ర ప్రభావం పడిందని గుర్తించిన స్థానిక ప్రజాప్రతినిధులంతా కవిత గెలుపును పార్టీలకు అతీతంగా కోరుకుంటున్నారని మంత్రి పునరుద్ఘాటించారు. నిజామాబాద్,కామారెడ్డి జిల్లాల అభివృద్ధిలో కవిత కీలక భూమిక పోషించనున్నారని అందరికీ ఆపార విశ్వాసం ఉన్న నేపథ్యంలో పార్టీలకు అతీతంగా ఏకపక్ష ఓటింగ్ జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో టీఆర్‌ఎస్‌కు దాదాపు 90శాతం ఓట్లు పడ్డా ఆశ్చర్యపోనవసరం లేదని ధీమా వ్యక్తం చేశారు.