కరోనా ఎఫెక్ట్... వారిని సురక్షితంగా కాపాడండి: ప్రధాని మోదీకి కేటీఆర్ ట్వీట్
కరోనా వైరస్ కారణంగా విదేశాల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని కాపాడాలంటూ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీని ట్విట్టర్ ద్వారా కోరారు.
హైదరాబాద్: ప్రపంచ దేశాలపై కరోనా వైరస్ విరుచుకుపడుతోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నిలువరించేందుకు అన్ని దేశాలు షట్ డౌన్ పాటిస్తున్నాయి. ఇలా భారత్ కూడా విమానసర్వీసులను నిలిపివేసింది. దీంతో చాలామంది భారతీయులు విదేశాల్లోనే చిక్కుకుపోయారు. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశంకాని దేశంలో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకురావాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీకి సోషల్ మీడియా ద్వారా కోరారు.
''గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ గారు, కరోనా వైరస్ కారణంగా దేశాలమధ్య రాకపోకలు నిలిచిపోవడంతో చాలామంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. మనీలా, రోమ్, సింగపూర్ మరియ కౌలాలంపూర్ విమానాశ్రాయాల్లో చాలామంది చిక్కుకుపోయారు. ఆయా దేశాల్లోని విదేశాంగ అధికారులను వారికి సహకరించాలని సూచించండి. వారిని భారత దేశానికి సురక్షితంగా తీసుకువచ్చే ఏర్పాటు చేయాలని కోరుతున్నా'' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
'' విదేశాంగ మంత్రి జయశంకర్, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారికి, విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని జాగ్రత్తగా ఇండియాకు తీసుకురావాలని కోరుతున్నా'' అంటూ మరో ట్వీట్ ద్వారా ప్రధానిని కోరినట్లే సంబంధిత కేంద్ర మంత్రులను కూడా కోరారు మంత్రి కేటీఆర్.