Asianet News TeluguAsianet News Telugu

మోదీ వచ్చే ముందు ఈడీ రావడం కామనే.. జైలులో పెడితే పెట్టుకోండి: ఎమ్మెల్సీ కవిత

మోదీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లల్లో.. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో బీజేపీ అధికారంలో వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు

Kalvakuntla kavitha Strong response on her name in ED remand report of Amit Arora in Delhi Liquor Scam
Author
First Published Dec 1, 2022, 10:19 AM IST

మోదీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లల్లో.. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో బీజేపీ అధికారంలో వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ తన పేరును ప్రస్తావించడంపై కవిత స్పందించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ..  ఏ రాష్ట్రానికైనా మోదీ పోయే ముందు.. ఈడీ రావడం చూస్తూనే ఉన్నామని అన్నారు. తెలంగాణలో వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు ఉన్నాయి కనుకే.. మోదీ కన్నా ముందు ఈడీ వచ్చిందని విమర్శించారు. ఇది కామనే అని అన్నారు. తన మీద, మంత్రుల మీద, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై మీద ఈడీ కేసులు పెట్టడం బీజేపీ హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ అని మండిపడ్డారు. ఇలాంటి వాటిని పట్టించుకునే అవసరం లేదని అన్నారు. 

దర్యాప్తు సంస్థలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెబుతున్నామని కవిత తెలిపారు. మీడియాలో లీక్‌లు ఇచ్చి నాయకులకు ఉన్న మంచి పేరు చెడగొడున్నారని విమర్శించారు ఇలాంటి వాటిని ప్రజలు తిప్పికొడతారని అన్నారు. ఈ పంథా మార్చుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ఈడీ, సీబీఐ‌లను ప్రయోగించి గెలవాలని అనుకుంటే చైతన్యవంతమైన తెలంగాణలో అది కుదరని పని అన్నారు. కేసులు పెడతాం, జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. భయపడేది లేదని అన్నారు. జైలులో పెడితే ఏమైతది అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని అన్నారు. ఇక, మీడియాతో మాట్లాడిన అనంతరం కవిత జగిత్యాల జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. 

ఇక, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి నిందితుల్లో ఒకరైన అమిత్ అరోరా అరెస్ట్ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత‌తో సహా పలువురి పేర్లను ప్రస్తావించిన సంగతి  తెలిసిందే. డిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు బుధవారం ఉదయం అమిత్ అరోరాను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. రిమాండ్ రిపోర్టులో వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ పేర్లు కూడా ఉన్నాయి.

కేసును దర్యాప్తు కోసం ఏజెన్సీకి అప్పగించిన తర్వాత కవిత తన మొబైల్ ఫోన్ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ)ని ఆరుసార్లు మార్చుకున్నారని ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇంకా, ఐఎంఈఐ ఆధారంగా డేటాను విశ్లేషించినట్టుగా తెలిపింది. దర్యాప్తుకు ఆటంకం కలిగించడానికి డిజిటల్ సాక్ష్యం నాశనం చేయబడిందని కనుగొంది.

‘‘శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అమిత్ అరోరా నియంత్రణలో ఉన్న సౌత్ గ్రూప్ అనే కంపెనీ నుంచి ఆప్ నాయకుల తరపున విజయ్ నాయర్ రూ. 100 కోట్ల ముడుపులు అందుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇదే విషయాన్ని అమిత్ అరోరా వెల్లడించారు. దర్యాప్తును అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే విస్తృతమైన డిజిటల్ సాక్ష్యాలను ధ్వంసం చేశారు. కేసును ఏజెన్సీకి అప్పగించిన తర్వాత 36 మంది అనుమానితులు/నిందితులు తమ 176 సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను ధ్వంసం చేశారు. 170 సెల్‌ఫోన్‌లలో 17 సెల్‌ఫోన్‌ల నుంచి డేటాను తిరిగి పొందగలిగాం. అన్ని ఫోన్లు దొరికి ఉంటే ఈ కేసులో చేతులు మారిని మరిన్ని ముడుపులు వెలుగులోకి వచ్చేవి. ఇతర ముఖ్యమైన వ్యక్తుల ప్రమేయం మరింత స్పష్టంగా బయటపడి ఉండేది’’ అని ఈడీ పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios