నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందించే సాయంపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఫెడరల్ ఫ్రంట్ మిత్రులకు ఎలాంటి సహాయం అందిస్తామో జగన్ కు కూడా అటువంటి సాయమే అందిస్తామని ఆమె చెప్పారు.

సమాయనుకూలంగా కేసీఆర్ కు ఉండే వ్యూహాలు ఆయనకు ఉంటాయని కవిత అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కచ్చితంగా టీఆర్ఎస్ జోక్యం చేసుకుంటుందని, ఇప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు టెన్షన్ అవసరం లేదని ఆమె అన్నారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని అన్నారు. 

ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మాటలు మారుస్తూ స్వార్థం కోసం కొత్త రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని ఆమె విమర్శించారు. ఇందిరా గాంధీ ఇచ్చిన గరీబీ హాఠావో నినాదమే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇస్తున్నారని ఆమె అన్నారు.

చౌపాల్‌ ఆన్‌ ట్విట్టర్‌ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు ఎంపీ కవిత సమాధానాలిచ్చారు. ప్రధాని మోదీ గ్రాఫ్‌ రోజు రోజుకు పడిపోతోందని అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతున్నాయని, దేశ రాజకీయాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

ఎంపీ నిధులు ఏడాదికి కనీసం రూ. 25 కోట్లు ఉండాలని, మోదీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల చట్టం ఆమోదించలేదని ఆమె అన్నారు. రక్షణ రంగంలో భారత్‌ స్వావలంబన సాధించాలని, టీఆర్‌ఎస్‌ పార్టీ విద్యార్థులను రాజకీయాల్లో ప్రోత్సహిస్తోందని చెప్పారు. నిజామాబాద్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నందున వల్ల ప్రజలకు కొంత అసౌకర్యం కలిగిందని చెప్పారు.

విభజన సమస్యల నుంచి మొదలుకొని రాష్ట్రానికి కేటాయించే నిధుల వరకు ప్రధాని మోడీ తెలంగాణపై వివక్ష కనబరిచారని కవిత విమర్శించారు. రాబోయే రోజుల్లో వైసీపీతో పాటు ఇతర పార్టీలను కలుస్తామని, రాహుల్ గ్రాఫ్ లో ఎలాంటి పెరుగుదల లేదని ఆమె అన్నారు.