Revanth Reddy: కాళేశ్వరం దర్యాప్తు సీబీఐకి వద్దు.. అది కేంద్రం చేతిలో పావు: సీఎం రేవంత్‌కు తమ్మినేని లేఖ
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించవద్దని, ఆ దర్యాప్తు సంస్థ కేంద్ర ప్రభుత్వం చేతిలో పావుగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సీబీఐకి కాకుండా సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించవద్దని సీఎం రేవంత్ రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ఈ రోజు లేఖ రాశారు. ఎందుకంటే సీబీఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో పావులా మారిందని ఆరోపించారు. కాబట్టి, కాళేశ్వరం అవకతవకలపై విచారణను సీబీఐకి అప్పగిస్తే కేంద్ర ప్రభుత్వానికి బ్లాక్ మెయిల్ చేయడానికి ఒక ఆయుధం ఇచ్చినట్టేనని అభిప్రాయపడ్డారు.
గతేడాది అక్టోబర్ 21వ తేదీన కాళేశ్వర ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు ఏడో బ్లాక్‌లోని 19-21 పియర్లు కుంగిపోయాయి. అదే సమయంలో అన్నారం ప్రాజెక్టు ముందు భాగంలో బుంగ పడి నీరు లీక్ అయింది. ఈ వరుస ఘటనలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై అనేక అనుమానాలు తలెత్తాయి.
ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రాజెక్టు అవకతవకలపై న్యాయ విచారణకు ఆదేశించింది. అయితే, బీజేపీ మాత్రం ఈ ప్రాజెక్టు పై విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నది.
Also Read: Mudragada: కాపు నేత ముద్రగడకు వైసీపీ షాక్? ఊరించి ఉసూరుమనిపించిందా?
అయితే, సీబీఐ, ఈడీ, ఐటీ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో పావులుగా మారాయని తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఇలాంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వానికి బ్లాక్ మెయిల్ చేయడానికి అవకాశం ఇచ్చినట్టేనని పేర్కొన్నారు. ఈ విచారణను సీబీఐకి అప్పగించకుండా సిట్టింగ్ జడ్జీతో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అంతేకాదు, ఈ లేఖలో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కొన్ని గణాంకాలనూ ఆయన ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ. 1.27 కోట్లు అని, ఇప్పటి వరకు రూ. 93 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం పలు బ్యాంకుల ద్వారా రూ. 87,449 కోట్ల రుణాలు మంజూరు కాగా, అందులో రూ. 71,565.69 కోట్లు విడుదలై ఖర్చు చేశారని తెలిపారు.