kadiyam srihari : భయపడొద్దు.. ఏడాదో, రెండేండ్లో మళ్లీ కేసీఆరే సీఎం - కడియం శ్రీహరి.. వీడియో వైరల్
kadiyam srihari comments : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమి పాలైంది. ఆ పార్టీ 39 స్థానాలకే పరిమితం అయ్యింది. దీంతో ఆ పార్టీ నాయకులు శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.
telangana assembly election results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రెండు రోజుల కిందట వెలువడిన ఫలితాల్లో ఆ పార్టీ 64 స్థానాలు కైవసం చేసుకుంది. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన బీఆర్ఎస్ కేవలం 39 స్థానాలకే పరిమితం అయ్యింది. దీంతో ఇప్పుడు ఆ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషింనుంది. సీనియర్ లీడర్లు, మంత్రులు కూడా పలు చోట్ల ఓడిపోయారు.
ఈ ఘోర పరాజయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వారిలో నిరుత్సాహాన్ని పారదోలి, ఉత్సాహాన్ని నింపేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరూ అధైర్య పడొద్దని, త్వరలోనే సీఎంగా మళ్లీ కేసీఆరే వస్తారని అన్నారు.
తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కడియం శ్రీహరి విజయం సాధించారు. దీంతో ఆయన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా ఘన్ పూర్ స్టేషన్ లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిపేందుకు ఈ వ్యాఖ్యలు చేశారు. హర్షధ్వానాల మధ్య శ్రీహరి మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు అధికారంలో లేకపోతే భయపడొద్దు. ఆరు నెలలైనా, ఏడాది అయినా, రెండేళ్లు అయినా కేసీఆర్ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం ఖాయం’’ అని అన్నారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బి.ఆరోగ్య్ ను 40,051 ఓట్ల తేడాతో ఆయన ఓడించారు. ఇదిలా ఉండగా.. పూర్తి మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అడగులు వేస్తోంది. నేటి (మంగళవారం) సాయంత్రం వరకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో స్పష్టం కానుంది.