హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సీనియర్ నేత కడియం శ్రీహరి ఆ పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ లో తీవ్రమైన వివక్షకు గురైనట్లు ఆయన భావిస్తున్నారని సన్నిహితులు అంటున్నారు. త్వరలో ఆయన బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

తొలి కెసిఆర్ మంత్రివర్గంలో డిప్యూటీ సిఎంగా పనిచేసిన శ్రీహరికి రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన నాయకుడిగా పేరు పొందిన ఆయనకు పార్టీలో పూర్తిగా ప్రాధాన్యం తగ్గింది.

శాసనసభ ఎన్నికల్లో కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ సీటును ఆశించారు. తనకు టికెట్ ఇవ్వడానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇష్టపడలేదు. అయితే, తన కూతురు కావ్యకు వరంగల్ లోకసభ సీటు ఇవ్వాలని కోరారు. అందుకు కూడా పార్టీ నాయకత్వం అంగీకరించలేదు. స్టేషన్ ఘనపూర్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకే ఇచ్చారు. దాంతో పార్టీ నాయకత్వంతో ఆయనకు విభేదాలు ప్రారంభమయ్యాయి.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాల్లోని కడియం శ్రీహరి అనుచరులకు టికెట్లు దక్కలేదు. కడియం శ్రీహరిని పార్టీ నాయకత్వం పూర్తిగా విస్మరించిందని చెప్పడానికి చాలా సంఘటనలున్నాయని అంటున్నారు.