హైదరాబాద్: అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మపై ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ దుమ్మెత్తిపోశారు. వర్మ ఓ పిచ్చి సినిమా తీశారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సినిమా ద్వారా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టడానికి వర్మ ప్రయత్నించారని ఆయన విమర్శించారు. 

తన సీన్లతో సినిమా విడుదల కాదని తాను ముందే చెప్తే తనను అపహాస్యం చేశారని ఆయన అన్నారు. ప్రార్థనలు, చట్టం సహకారంతో ఎక్కడా తన పేరు వినిపించకుండా చేశామని అన్నారు. మోసాలు, అబద్ధాలు ఆడి ఎన్నో చేసి అనుమతి లేకుండా వీడియోలు, ట్రైలర్ విడుదల చేశారని ఆయన వర్మపై మండిపడ్డారు.

కనీసం తన పేరు వాడుకోవడానికి కూడా వర్మకు అవకాశం లేకుండా పోయిందని ఆయన అన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫొటోను మార్ఫింగ్ చేసి తాను అనుమతి ఇచ్చినట్లుగా ఫొటో రూపొందించారని ఆయన అన్నారు. సత్యమే గెలిచిందని ఆయన అన్నారు. ఆర్జీవీకీ దేవుడు, చట్టం, కోర్టు, సెన్సార్ బోర్డు బుద్ధి చెప్పాయని పాల్ అన్నారు. 

ఇప్పుడైనా మారుతాడని అనుకుంటే లంచాలు ఇచ్చి సినిమాను ఆపడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. వర్మకు శాస్తి జరుగుతుందని, ప్రజల్లో శాంతి ప్రచారం చేస్తున్న తనను అవమానపరిచాడని, యేసు ప్రభువును కూడా అవమానించారని, చివరకు మూవీ ఫ్లాపైందని ఆయన అన్నారు. 

వర్మలో గర్వం తగ్గిందని, ముఖం చూపించలేకపోయాడని, ఇంకా చైనా నుంచి వచ్చాడో లేదో తెలియదని, నేపాల్ వెళ్లి చైనా అంటున్నాడేమోనని, నోరు విప్పితే వర్మ అబద్దాలే చెబుతారని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ తెలియదని ఓ చానెల్ లో అన్నారని ఆయన గుర్తు చేశారు. 

చంద్రబాబులా ఉన్నాడా.. మీ కొడుకులా ఉన్నాడా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారని ఆయన అన్నారు. ఎవరి ఫూల్ చేయాలని అనుకుంటున్నాడని ఆయన వర్మపై విరుచుకుపడ్డారు. ఇలాంటి చౌకబారు ప్రచారం మానుకుని దేవుడికీ తనకూ ప్రజలకు క్షమాపణ చెప్తే మళ్లీ సినిమాల్లో విజయం సాధించవచ్చునని ఆయన అన్నారు. లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని ఆయన అన్నారు. 

కుటుంబ సభ్యులు, ప్రజలు వర్మను వెలి వేశారని, ముంబై వెళ్తే అక్కడ సినిమాలు లేవని, ఆంధ్రాలోనూ లేవని, ఎక్కడా సినిమాలు లేక ఎవరో డబ్బులు ఇస్తే ఆ సినిమా చేశాడని ఆయన అన్నారు. ఇలాంటి సినిమాలు ఆపేయడం మంచిదని ఆయన అన్నారు.