హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కలలకం రేపుతున్న ఇంటర్ పరీక్షల ఫలితాల అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

అమీర్‌పేటలో ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇంటర్ ఫలితాల వ్యవహారపై సీఎం కేసీఆర్ ఆలస్యంగా స్పందించడం బాధాకరమని అన్నారు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని బర్త్‌రఫ్‌ చేయాలని లేనిపక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకోవడంపై పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి  రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బోర్డు అవకతవకలపై విపక్షాలు చేస్తున్న ఆందోళనకు తమ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 

కేసీఆర్ పూర్తి స్థాయిలో వివరణ ఇస్తే విద్యార్థుల ఆత్మహత్యలు నిలుస్తాయని స్పష్టం చేశారు. ఇప్పటికైనా విద్యార్థులకు న్యాయం జరగకపోతే తానే ఇంటర్ బోర్డు ఎదుట ధర్నా చేస్తానని కేఏ పాల్ తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరించారు.