జూబ్లీహిల్స్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న క్లాత్ షోరూమ్ లో నుంచి లక్షలు విలువజేసే చీరలను చోరీ చేస్తున్న ఇద్దరు తల్లీకూతుర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ప్రస్తుతం రిమాండ్ కు తరలించారు. 

వారికి చీర‌లంటే మోజు. ల‌క్ష‌లు విలువ చేసే చీర‌ల‌ను క‌ట్టుకొని తిర‌గాల‌ని వారికి కోరిక‌. కానీ ఆ కోరిక నెర‌వేర్చుకోవ‌డానికి వారికి ఆర్థిక స్థోమ‌త స‌హ‌క‌రించ‌డం లేదు. దీంతో వారు అడ్డ‌దారులు తొక్కారు. క్లాత్ షో రూమ్ ల‌కు క‌ష్ట‌మ‌ర్లలా వెళ్తారు. అక్క‌డి చీర‌ల‌ను చూస్తారు. షాప్ నిర్వాహ‌కుల క‌ళ్లుగ‌ప్పి ఖ‌రీదైన చీర‌ల‌ను ఎత్తుకెళ్తారు. అయితే ఇలాంటి ప‌నులు ఎక్కువ రోజులు సాగ‌వు క‌దా.. ఇక్క‌డ కూడా అదే జ‌రిగింది. ఓ షాప్ నిర్వాహ‌కురాలు వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో వారు దొరికిపోయారు. 

హైద‌రాబాద్ లోని బంజారాహిల్స్, ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లోని ఖ‌రీదైన బ‌ట్ట‌ల షోరూమ్ ల‌లో చీర‌లు దొంగ‌తనం చేస్తున్న త‌ల్లీకూతుర్ల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. వారిని రిమాండ్ కు పంపించారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. హైద‌రాబాద్ పట్ట‌ణంలోని అంబ‌ర్ పేట (AmberPeta), స‌లీంన‌గ‌ర్ (Salimnagar) ప్రాంతానికి చెందిన ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు ఖ‌రీదైన చీర‌లంటే బాగా ఇష్టం. వారిలో ఒక‌రి పేరు నల్లూరి సుజాత కాగా మరొక‌రు ఆమె కూతురు నల్లూరి వెంకటలక్ష్మి పావని. వీరిద్ద‌రూ త‌ల్లీకూతుర్లు. అయితే వీరి ఆర్థిక ప‌రిస్థితులు అంతంత మాత్రంగానే ఉండ‌టంతో విలువైన చీర‌ల‌ను కొనుగోలు చేయ‌డం క‌ష్టంగా మారింది. 

ఎలాగైనా ఖ‌రీదైన చీర‌ల‌ను ధ‌రించాల‌నే కోరిక వారిని దొంగ‌లుగా మార్చింది. ఈ క్ర‌మంలో ఈ నెల 21వ తేదీన జూబ్లీహిల్స్ లోని ఓ బ‌ట్ట‌ల షోరూంలోకి వెళ్లారు. ఆ షోరూమ్ రోడ్ నెంబ‌ర్ నెం. 45లో ఉంది. ఆ త‌లాశా క్లాత్ షోరూంకు వెళ్లి వారు ఇష్ట‌ప‌డ్డ చీర‌లను సెలెక్ట్ చేశారు. అందులో రూ. 1.10 ల‌క్షలు విలువ చేసే 5 చీర‌లు ఉన్నాయి. వాటిని షాప్ నిర్వాహ‌కుల క‌ళ్లు గ‌ప్పి ఎత్తుకెళ్లిపోయారు. అనంత‌రం అదే ఏరియాలోని రోడ్‌ నెం. 10లో ఉన్న గోల్డెన్‌ థ్రెడ్స్ బ‌ట్ట‌ల షో రూంలోకి ప్ర‌వేశించారు. అక్క‌డ దాదాపుగా రూ.2.80 లక్షల విలువైన 4 చీర‌ల‌ను తీసుకున్నారు. అక్క‌డ కూడా షాప్ నిర్వాహ‌కుల నుంచి త‌ప్పించుకొని చీర‌ల‌ను దొంగ‌లించుకొని వెళ్లిపోయారు. 

చీర‌ల దొంగ‌తనం విష‌యంలో ఓ షాపు ఓన‌ర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. దొంగ‌త‌నం జ‌రిగిన తీరుపై క్రైం సీఐ రమేష్, డీఎస్‌ఐ లక్ష్మీనారాయణ నిశితంగా దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల సాయం తీసుకున్నారు. వారిని ట్రేజ్ చేశారు. దొంగ‌త‌నం చేసిన త‌రువాత వారిద్ద‌రూ జూబ్లీహిల్స్‌ మెట్రో స్టేషన్‌లో మెట్రో ఎక్కార‌ని గుర్తించారు. త‌రువాత వారు ముసరంబాగ్‌ స్టేషన్‌లో దిగార‌ని క‌నుగొన్నారు. మెట్రో స్టేష‌న్ లో వీరు టిక్కెట్ కొనుగోలు చేసే క్రమంలో వారి వ‌ద్ద ఉన్న మెట్రో కార్డ్ ను ఉప‌యోగించారు. దీని ద్వారానే వారెవ‌రో పోలీసులు అర్థం అయ్యింది. వారి అడ్ర‌స్, మిగితా వివ‌రాలు అన్నీ తెలుసుకున్న పోలీసులు సోమ‌వారం నిందితుల‌ను అరెస్ట్ చేశారు. అనంత‌రం వారిని రిమాండ్ కు త‌ర‌లించారు. నిందితుల నుంచి రూ. 3.90 లక్షలు విలువ చేసే 9 చీర‌ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు.