Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో దూకుడు పెంచుతున్న బీజేపీ.. ఈ నెల 7న బూత్​ కమిటీలతో వర్చువల్‌గా జేపీ నడ్డా మీటింగ్..

తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ.. అందుకు సంబంధించిన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసే దిశగా సాగుతుంది.

JP Nadda to hold virtual meeting bjp booth committee members in telangana
Author
First Published Jan 1, 2023, 10:15 AM IST

తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ.. అందుకు సంబంధించిన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసే దిశగా సాగుతుంది. జాతీయ స్థాయి నేతలు ఒక్కొక్కరిగా తెలంగాణ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని బీజేపీ బూత్ కమిటీల అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్​చార్జ్​లతో జనవరి 7న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్​గా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ విస్తరణ, చేపట్టాల్సిన కార్యక్రమాలపై జేపీ నడ్డా దిశానిర్దేశం చేయనున్నారు.  అలాగే గ్రౌండ్ లెవెల్లోని పార్టీ కార్యకర్తలతో కూడా ఆయన సంభాషించనున్నారు. 

రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గం పరిధిలో కనీసం 300  నుంచి 400 మంది బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్​చార్జులు ఒకే చోట ఈ మీటింగ్​లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో డిజిటల్ స్క్రీన్‌లు ఏర్పాటు చేయనున్నారు. అయితే పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసేవారితో పార్టీ జాతీయ అధ్యక్షుడు సంభాషించడం వారిలో మరింత ఉత్తేజాన్ని నింపుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్‌కు సంబంధించి ఏర్పాట్లను పార్టీ ఇటీవల కొత్తగా నియమితులైన అసెంబ్లీ నియోజకవర్గాల పాలక్‌లు పర్యవేక్షించనున్నారు. ఈ పాలకుల్లో కొందరు ఇప్పటికే తమ నిర్దేశిత నియోజకవర్గాల్లో వివిధ స్థాయిల్లో ఉన్న వారితో సమన్వయం చేసుకునేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు రానున్న మూడు నెలల్లో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు బీజేపీ కార్యచరణను సిద్దం చేసింది. జనవరి నుంచి మార్చి మధ్య.. 10 వేల గ్రామ సభలు, ప్రజా గోస-బీజేపీ భరోసా బైక్ ర్యాలీలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహించేందుకు రెడీ అయింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్టుగా బీజేపీ ఇదివరకే తెలిపింది. ఈ సందర్భంగా తెలంగాణలోని అధికార బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై చార్జిషీటును విడుదల చేయనున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

ఇదిలా ఉంటే.. ఇటీవల మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ఓ రిసార్ట్‌లో బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్‌లు, విస్తారక్, పాలక్, కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన బీజేపీ జాతీయ సంస్థాగత  ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్.. పార్టీ శ్రేణులు దిశానిర్దేశం చేశారు. మిషన్ 90 పై ఫోకస్ చేయాలని చెప్పారు. బూత్ కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టాలని చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణం చేయాలన్నారు. రాబోయే 8 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రావొచ్చని అన్నారు. తెలంగాణలో ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో ప్రధాని మోడీ తెలంగాణకు రానున్నారని బీఎల్ సంతోష్ వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios