Asianet News TeluguAsianet News Telugu

నేడు హన్మకొండకు జేపీ నడ్డా: నితిన్, మిథాలీరాజ్‌లతో భేటీ కానున్న బీజేపీ చీఫ్.. షెడ్యూల్ ఇదే..

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు.

JP Nadda Hanamkonda tour likely to meet actor nithin and cricketer mithali raj
Author
First Published Aug 27, 2022, 9:34 AM IST

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు.  అయితే తెలంగాణ పర్యటనకు వస్తున్న జేపీ నడ్డా.. పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు. 

ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే నేడు జేపీ నడ్డా.. ప్రముఖ నటుడు నితిన్, మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌‌లను కలవనున్నారు. అయితే ఈ పరిణామాలను గమనిస్తే.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. 

జేపీ నడ్డా టూర్ షెడ్యూల్.. 
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో జేపీ నడ్డా సతీసమేతంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అనంతరం శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌కు చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అక్కడే భారత మహిళా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌తో భేటీ కానున్నారు. అనంతరం ఆయన హెలికాప్టర్‌లో బయలుదేరి వరంగల్ చేరుకుంటారు. అక్కడ బండి సంజయ్, ఇతర బీజేపీ నాయకులతో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. తర్వాత బీజేపీ సభ జరుగుతున్న ఆర్ట్స్ కాలేజ్ వద్దకు చేరుకుంటారు. 

దాదాపు గంటకు పైగా జేపీ నడ్డా బీజేపీ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన అనంతరం హెలికాప్టర్‌లో శంషాబాద్‌కు బయలుదేరుతారు. అనంతరం నోవాటెల్‌ హోటల్‌లో హీరో నితిన్‌తో సమావేశం కానున్నారు. అలాగే మరికొందరు సినీ ప్రముఖులు, కవులు, రచయితలతో జేపీ నడ్డా సమావేశమవుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే నితిన్, మిథాలీరాజ్‌‌, ఇతర ప్రముఖు‌లతో భేటీ కానున్న జేపీ నడ్డా వారితో ఏ అంశాలు చర్చిస్తారనే విషయం మాత్రం స్పష్టం తెలియడం రాలేదు. 

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మిథాలీరాజ్‌ను జేపీ నడ్డా పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే తెలంగాణ ప్రాంతానికి చెందిన నితిన్‌తో కూడా జేపీ నడ్డా రాజకీయ అంశాలు చర్చించనున్నారని, కాషాయ పార్టీలోకి రావాలని ఆహ్వానించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక, తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతానికి చెందిన నితిన్.. రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. తెలుగు చిత్ర పరిశమ్రలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి.. సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. 

ఇక, కొంత కాలంగా బీజేపీ అధిష్టానం.. తెలంగాణ‌పై విపరీతమైన ఫోకస్ పెట్టింది. బీజేపీ అగ్రనేతలు వరుసగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. గత నెలలో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ వేదికగా నిలిచింది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా మునుగోడులో బీజేపీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు, ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌లతో ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. తాజాగా జేపీ నడ్డా కూడా నితిన్, మిథాలీరాజ్‌లతో పాటు పలువురు ప్రముఖులతో భేటీ కానుండటం మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్నికల ప్రచారానికి సినీ గ్లామర్ జోడించడంతోపాటు ప్రత్యేక వర్గాల ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ వ్యూహాలను అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios