Asianet News TeluguAsianet News Telugu

దర్యాప్తు సంస్థలు కేసీఆర్ కూతురుకు సమన్లు పంపడానికి కారణం ఏమిటి?: జేపీ నడ్డా

కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజలకు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. 

JP Nadda Comments in Public meeting in karimnagar
Author
First Published Dec 15, 2022, 6:43 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యువత, మహిళలు, రైతులు, పేదలు, అణగారిన వర్గాల వారికి సాధికారత కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అయితే తెలంగాణలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజలకు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేస్తుందని విమర్శించారు. గురువారం కరీంనగర్‌లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ సభకు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్బంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయస్వామిలకు ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. ‘‘బండి సంజయ్ నాయకత్వంలోని ప్రజాసంగ్రామ యాత్ర 114 రోజుల్లో 56 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 5 దశల్లో 1458 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను’’ అని అన్నారు. 

తాను వస్తున్న సమయంలోనే టీఆర్‌ఎస్‌ వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యం అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఒకప్పుడు ఎవరైనా గిరిజన మహిళ రాష్ట్రపతి అవుతారని, దళిత వ్యక్తి రాష్ట్రపతి అవుతారని అనుకున్నారా? అని అడిగారు. అసదుద్దీన్ ఒవైసీతో సంబంధాలు కొనసాగిస్తున్నందుకే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవడం కేసీఆర్‌కు ఇష్టం లేదని విమర్శించారు. తెలంగాణ చరిత్ర, రజాకార్ల క్రూరత్వం, వారు సమాజాన్ని ఎలా విభజించడానికి ప్రయత్నించారో మనకు తెలిసిందేనని కామెంట్ చేశారు.

తెలంగాణ ధనిక రాష్ట్రం అని కేసీఆర్ చెబుతారని.. కానీ ఆయన వల్లే అప్పుల రాష్ట్రంగా మారిందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మారిందని.. రానున్న రోజుల్లో వీఆర్‌ఎస్‌ తీసుకుంటుందని ఎద్దేవా చేశారు. ‘‘కేసీఆర్ కుమార్తెకు దర్యాప్తు సంస్థలు సమన్లు పంపడానికి కారణం ఏమిటి? దీని గురించి మాట్లాడితే కేసీఆర్‌కు కోపం వచ్చి ఉండొచ్చు.. కానీ వారి అవినీతి వ్యవహారాలే ఇందుకు కారణం’’ అని చెప్పారు. 

Also Read: తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక్కటే.. తెలంగాణలో కమలం వికసించాలని మోదీ చెప్పారు: బండి సంజయ్

కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు..తెలంగాణ ప్రజలకు ఇబ్బందులు సృష్టించాయని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ వాగ్దానాలన్నీ మరిచిపోయారని మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం పేదలకు డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టించడంలో కేసీఆర్ విఫలమయ్యారని.. ఆయన కోసం ఫామ్‌హౌస్‌ను మాత్రం నిర్మించుకున్నారని ఎద్దేవా చేశారు. దోపిడి కోసమే ధరణి పోర్టల్‌ తీసుకొచ్చారని విమర్శించారు. రుణమాఫీ చేస్తారనే ఆశలు పెట్టుకున్న రైతులు కూడా మోసపోయారని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ హామీని మర్చిపోయారని విమర్శించారు. కేసీఆర్‌కు గుడ్ బై చెప్పాల్సిన సమయం అసన్నమైందన్నారు. 

బండి సంజయ్ పాదయాత్ర ఇంతటితో ముగియలేదని.. మరో విడత యాత్ర మాత్రమే ముగిసిందని జేపీ నడ్డా అన్నారు.  త్వరలోనే తదుపరి దశ యాత్ర తేదీలను ప్రకటిస్తామని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios